డిజిటల్‌ నేరాలకు చెక్‌పెట్టేలా.. ‘సైబర్‌ వారియర్స్‌’

డిజిటల్‌ నేరాలకు చెక్‌పెట్టేలా.. ‘సైబర్‌ వారియర్స్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను అనుసరిస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి మోసాలపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. ఇంకా పలువురు సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకొని మోసపోతున్నారు. ఈ నేరాలకు చెక్‌ పెట్టేలా ఎన్‌సీసీ (National Cadet Corps) ప్రణాళికలు రచిస్తోంది. 10వేల మంది క్యాడెట్లతో సైబర్‌ వారియర్స్‌ (Cyber warriors)ను ఏర్పాటుచేయాలని ప్రణాళికలు చేస్తున్నట్లు ఎన్‌సీసీ డీజీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ వీరేంద్ర వత్స్‌ వెల్లడించారు. వీరిని నేషనల్ డేటాబేస్‌తో లింక్ చేయనున్నారు.

దీంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో వేగంగా స్పందించేందుకు లక్ష మంది క్యాడెట్లకు ‘యువ ఆపద మిత్ర’ (Yuva Apda Mitras)లుగా శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. వీరిని కూడా డేటా బేస్‌తో అనుసంధానిస్తామని చెప్పారు. దానివల్ల ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వారి సేవలను వినియోగించుకునే వీలు ఉంటుందని దిల్లీలో నిర్వహించిన మీడియా కార్యక్రమంలో తెలిపారు. దేశవ్యాప్తంగా నాలుగైదు హబ్స్ ఏర్పాటుచేసి, ఇక్కడ ఎంపిక చేసిన క్యాడెట్లకు డ్రోన్‌, కౌంటర్ డ్రోన్ అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇదిలాఉంటే.. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్‌సీసీకి చెందిన పరేడ్ అండ్ కంటింజెంట్ కమాండర్లు తొలిసారి కత్తితో మార్చ్ చేయనున్నారు.