డ్రోన్ పైలట్ కావాలనుకుంటున్నారా? - 'పీఎం ఉచ్చతర్ శిక్షా అభియాన్'తో అవకాశం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 డిగ్రీ కళాశాలల్లో అమలు - డ్రోన్‌లపై నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహణ - విద్యార్థినుల్లో నైపుణ్యాలను పెంచి కల్పించనున్న ఉపాధి అవకాశాలు - ఇతర కోర్సుల్లోనూ ప్రత్యేక శిక్షణ

డ్రోన్ పైలట్ కావాలనుకుంటున్నారా? - 'పీఎం ఉచ్చతర్ శిక్షా అభియాన్'తో అవకాశం

ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (PM-USHA) అనేది కేంద్ర ప్రాజెక్ట్​. దీన్ని 2023లో కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పథకం జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా పని చేస్తుంది. దేశంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఉన్నత విద్య నాణ్యత, విద్యార్థుల పరిశోధన నైపుణ్యాలను పెంచేందుకు, మౌలిక సదుపాయాల మెరుగుపరచడానికి నిధులు సమకూరుస్తుంది.

ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు నిధులను కేటాయిస్తుంది. ఈ పథకానికి కొనసాగింపుగా రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (RUSA) స్కీం తీసుకొచ్చారు. ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యతను పెంచడం, పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నైపుణాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉదాహరణకు డ్రోన్​ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నారు. మహిళా సాధికారత ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఈ పథకం కీలక పాత్ర వహిస్తుంది.

ఇతర కోర్సుల్లోనూ : సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్,డేటా సర్వీసెస్, మైక్రోగ్రీన్స్, ఎంబ్రాయిడరీ వంటి కోర్సులోను కూడా శిక్షణ ఇస్తారు.

నిబంధనలు పాటించడం తప్పనిసరి : ఈ పథకం కింద నిధులు పొందాలంటే రాష్ట్రాలు జాతీయ విద్యా విధానం (NEP) నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

అర్హులు ఎవరంటే : రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న కళాశాలలు.

4 అంశాలపై శిక్షణ : విద్యార్థినుల్లో నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు డిగ్రీ కళాశాలల్లో అమలు చేస్తున్నారు. ఇటీవల డాక్టర్ వీఎస్​ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రోన్​లపై నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా 4 అంశాలపై విద్యార్థులకు ఓ సంస్థ తర్ఫీదు నిచ్చింది. ఎరిస్ ఆగ్రో లిమిటెడ్ సంస్థకు చెందిన ప్రతినిధులు డ్రోన్ పైలట్, సర్వీసింగ్, మైక్రో గ్రీన్, భూసార పరీక్షలపై శిక్షణ ఇచ్చారు.

మహిళా సాధికారతకు కేంద్రం ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ. విజయబాబు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో ఒక బ్యాచ్‌కు శిక్షణ ముగిసిందని అన్నారు. 2వ బ్యాచ్‌ ఈనెల చివరి వారంలో ప్రారంభం అవుతుందని ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు.

రూ.కోటి నిధులను మంజూరు చేసిన కేంద్రం : తొలుత ఈ ప్రాజెక్టు విజయనగరం జిల్లా ఎస్​.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చింది. తర్వాత విశాఖ జిల్లాలో డాక్టర్ వీఎస్​ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు కేటాయించడం గమనార్హం. ఇందుకోసం సుమారు రూ.కోటి నిధులను ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కోర్సులో 17 అంశాలు ఉంటాయి. వారం రోజుల పాటు శిక్షణ కొనసాగుతుంది. ఒక్కో బ్యాచ్​లో 50 మంది విద్యార్థినులకు తర్ఫీదు నిస్తారు. 800 మంది విద్యార్థులకు శిక్షణనిచ్చేలా ప్రణాళిక రూపొందించామని ప్రిన్సిపల్ విజయబాబు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల వారికి : ప్రధానంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఇది చక్కటి అవకాశం. డ్రోన్లతో పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేయడం, విత్తనాలు చల్లడం వంటి అంశాలపై మెలకువలను నేర్పిస్తున్నారు. బయట ఈ శిక్షణ పొందాలంటే కనీసం రూ.5,000 వరకు ఫీజు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకం గ్రామీణ విద్యార్థినులకు వరమని చెప్పవచ్చు.