తొర్రూర్లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి పీఏపై దాడి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. స్పష్టమైన మెజారిటీ ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సజావుగా జరుగుతోంది. హంగ్ వచ్చిన పలు మున్సిపాలిటీల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో పలు మున్సిపాలిటీల్లో ఘర్షణలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో తోపులాట జరిగింది. అక్కడికి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి పీఏపై కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు.
బలాబలాలు సమానం.. డ్రా ద్వారా ఛైర్మన్ ఎన్నిక
తొర్రూర్లో మొత్తం 16 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల గెలుపొందాయి. ఇక్కడ ఎక్స్అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలిద్దరూ కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలు సమానంగా మారడంతో డ్రా ద్వారా ఛైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. మరోవైపు వరంగల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా కావ్య పేరు ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని ఆ పార్టీ చెబుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో ఛైర్మన్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో ఓటు కీలకమైంది. ఈ నేపథ్యంలో ఒకటో వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థి అక్కమ్మ కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పరిగి పీఎస్ వద్ద నిరసన చేపట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి అక్కమ్మ ఎక్కడున్నారో తెలియడం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలే ఆమెను తీసుకెళ్లారని వారు ఆరోపిస్తున్నారు.


Pratiroju 




