గ్యాస్ కనెక్షన్ కావాలా? - ఏజెన్సీకి వెళ్లకుండానే సులభంగా ఇలా పొందండి!

కొత్తగా ఎల్​పీజీ గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటున్నారా? దరఖాస్తు ప్రక్రియ, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోండిలా!

గ్యాస్ కనెక్షన్ కావాలా? - ఏజెన్సీకి వెళ్లకుండానే సులభంగా ఇలా పొందండి!

గతంలో కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే అదో పెద్ద ప్రక్రియగా ఉండేది. గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా దేశంలో గ్యాస్ పంపిణీ సంస్థలు ఈ సేవలను సులభతరం చేస్తున్నాయి.

కొత్తగా ఎల్​పీజీ గ్యాస్ కనెక్షన్ పొందడానికి, మీరు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌ (www.mylpg.in)లో లేదా ఆఫ్​లైన్​లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన చిరునామాతో ఆధార్, పాన్, ఓటరు ఐడీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు స్థానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీని సంప్రదించవచ్చు. కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందడానికి ముందుగా మీకు కావాల్సిన ప్రొవైడర్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

గ్యాస్ కొత్త కనెక్షన్ కోసం కావాల్సిన పత్రాలు :

  • ఆధార్ కార్డ్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఓటర్ ఐడీ
  • టెలిఫోన్/నీటి/ విద్యుత్ బిల్లు
  • పాస్​పోర్ట్
  • బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ లేదా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్
  • ఇంటి రిజిస్ట్రేషన్ పత్రం
  • ఫ్లాట్ స్వాధీనం లేఖ

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలంటే!

  • మీరు మొదటగా ఎల్​పీజీ గ్యాస్ అధికారిక వెబ్​సైట్ సందర్శించి న్యూ గ్యాస్ కనెక్షన్ అనే లింక్ క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు ఓపెన్ అయిన దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
  • రాష్ట్రం, పంపిణీదారు పేరు, మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి ముఖ్యమైన వివరాలను అందించాలి.
  • అనంతరం అక్కడ వచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి 'సబ్మిట్' బటన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు అవసరమైన కేవైసీ పత్రాలు, గుర్తింపు, చిరునామా రుజువు, మీ పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేయాలి.
  • ఆపై రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత మీ పత్రాలు ధృవీకరించబడతాయి.
  • మీరు నమోదు చేసిన అన్ని వివరాలు సరైనవి అయితే మీ దరఖాస్తు ఆమోదించబడుతుంది. మీకు కొత్త గ్యాస్ కనెక్షన్ వస్తుంది.

ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలంటే!

  • మీ సమీపంలోని ఎల్​పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్​ కార్యాలయానికి వెళ్లండి.
  • మీకు తెలియకుంటే కస్టమర్ కేర్​కు కాల్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
  • ఆఫీసుకు వెళ్లిన తర్వాత దరఖాస్తు ఫారమ్​ ఇస్తారు.
  • అందులో మీ వ్యక్తిగత వివరాలతో నింపి చిరునామా రుజువు, గుర్తింపు రుజువు వంటి కేవైసీ పత్రాలను జత చేసి డిస్ట్రిబ్యూటర్​కి ఇవ్వాలి.
  • అదే విధంగా మీకు సబ్సిడీ వర్తిస్తే అందుకోసం రెండు ఫొటో కాపీలు, సబ్సిడీ ధ్రువీకరణ పత్రాల​ను సైతం సమర్పించాలి.
  • ఫార్మాలిటీ పూర్తయిన తర్వాత మీ గ్యాస్ డీలర్ కొత్త కనెక్షన్​ విషయాన్ని ఫోన్ లేదా మెసేజ్ ద్వారా లేదా ఈ-మెయిల్ ద్వారా ధ్రువీకరిస్తారు.

మిస్డ్‌కాల్​తో రీఫిల్ బుక్‌: ప్రస్తుతం దేశంలోనే అగ్రగామిగా పేరొందిన అతిపెద్ద ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సరికొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. కొత్త ఇండేన్ వంట గ్యాస్ కనెక్షన్‌ కోసం 84549-55555 నెంబరుకు మిస్డ్‌ కాల్ ఇవ్వడంతో నమోదు చేసుకోవచ్చని సంస్థ గతంలో తెలిపింది. ప్రస్తుత వినియోగదారులు నమోదిత ఫోన్‌నెంబర్ నుంచి ఈ నెంబరుకు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

ఆన్​లైన్​ ద్వారా హెచ్​పీ గ్యాస్​ను బుక్ చేసుకోవచ్చు. ముందుగా రీఫిల్​ను బుక్​ చేసేందుకు 9666023456 కు ఫోన్ నంబర్​కు కాల్ చేయాలి. ఆ తర్వాత మీ పేరు మీద నమోదైన కంజ్యూమర్ సంఖ్యను గ్యాస్ ఏజెన్సీ నిర్ధరించిన తర్వాత సంబంధిత సంఖ్యను నమోదు చేస్తే చాలు. మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.

వాట్సాప్ ద్వారా సేవలు: హెచ్​పీసీఎల్ వాట్సాప్ ద్వారా హెల్ప్​లైన్ సేవలను కూడా ప్రారంభించింది. వాట్సాప్ సంబంధిత నంబరు 92222201122 ను మీ ఫోన్​లో భద్రపరుచుకుని వాట్సాప్ ద్వారా సేవలను పొందే అవకాశం ఉంది. గ్యాస్​ సిలిండర్ కావాలంటే బుక్​ అని, గ్యాస్​కు లీకేజీ సమస్యలనేవి ఉంటే లీకేజీ అని, ఇతర రకాలైన సేవలు కావాలంటే హెల్ప్​ అని సందేశాన్ని పంపిస్తే చాలు. అయితే ఇందులో చిక్కేంటంటే మీరు రిజిస్టరైన మొబైల్ నంబర్ నుంచే మెసేజ్​ను పంపాల్సి ఉంటుంది గమనించగలరు.