సంతానం పేరుతో మోసం.. బంగారంతో ఉడాయించిన దుండగుడు

సంతానం పేరుతో మోసం.. బంగారంతో ఉడాయించిన దుండగుడు

భూదాన్‌ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి పరిధిలోని గాంధీనగర్‌లో సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని ఓ వ్యక్తి మోసానికి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతానం కోసం ఎదురుచూస్తున్న ప్రణీత దంపతులతో ఓ వ్యక్తి కేరళ యునాని వైద్యుడినని పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించాడు.

ఓ తైలం ఇచ్చి దానిని ఒంటికి రాసుకుంటే 40 రోజుల్లో ఫలితం వస్తుందని నమ్మించాడు. మెడలోని బంగారాన్ని తీసి స్నానం చేసి వచ్చి తైలాన్ని రాసుకోవాలని చెప్పడంతో బాధితురాలు స్నానానికి వెళ్లగా సదరు వ్యక్తి నగలు తీసుకుని పరారయ్యాడు. స్నానం చేసి వచ్చిన తర్వాత నగలు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.