రివ్యూ: రూ.5 కోట్లతో తీస్తే.. రూ.50 కోట్లు వసూలు చేసిన ‘ఎకో’ ఎలా ఉంది?
కథేంటంటే..
కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కలిపే దట్టమైన అటవీ ప్రాంతం కాట్టుకున్ను. అక్కడి కొండపై మిలాతియా (బియానా మోమిన్) అనే వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. కొండపై కాకుండా గ్రామంలో ఇతర ప్రజలతో కలిసి జీవించాలని ఆమె కుమారులు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. దీంతో ఆమె బాగోగులు చూసేందుకు పీయోస్ (సందీప్ ప్రదీప్) అనే యువకుడిని నియమిస్తారు. ఆ కొండపైకి ఎవరూ రాకుండా వారికి తోడుగా మలేషియన్ బ్రీడ్ శునకాలు రక్షణగా ఉంటాయి. కొన్ని నెలల కిందట మిలాతియా భర్త కురియాచన్ (సౌరభ్ సచ్‌దేవ్) ఓ క్రిమినల్ కేసులో తప్పించుకుని, అడవిలోకి పారిపోతాడు. అతడి కోసం పోలీసులతో పాటు, మరికొంత మంది కూడా వెతుకుతూ ఉంటారు. కురియాచన్ ఆచూకీ కనుక్కొనేందుకు అడవిలోకి వెళ్లిన అతడి స్నేహితుడు మోహన్ పోతన్ (వినీత్) హత్యకు గురవుతాడు. అసలు కురియాచన్ కోసం అంత మంది ఎందుకు వెతుకుతున్నారు? కొండపై మిలాతియా ఒక్కతే ఎలా ఉండగలుగుతోంది? పీయోష్, మలేషియన్ బ్రీడ్ కుక్కల నేపథ్యం ఏంటి? అన్నది చిత్ర కథ.
ఎలా ఉందంటే..
పైన కథ చదివారు కదా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి అసలు నేపథ్యం ఏమై ఉంటుందా? అని ఆలోచించండి. మన ఆలోచనలకు భిన్నంగా తెరపై ‘ఎకో’ కథ ఉంటుంది. అందుకే మలయాళ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. రూ.5 కోట్లతో తీస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా అంటే ఇలాగే తీయాలి.. ఈ ఫార్మాట్‌లోనే ఉండాలనే కొలతలకు నేటి యువ దర్శకులు ఎప్పుడో చరమగీతం పాడేశారు. వారిలోని సృజనాత్మకత మేలుకొన్న వేళ ‘ఎకో’లాంటి కథలే వెండితెరపై ఆవిష్కృతమవుతాయి. దర్శకుడు దిజింత్ అయ్యతన్ తీసిన మిస్టరీ థ్రిల్లర్ ‘కిష్కింధకాండం’ సినీ ప్రియులు చూసే ఉంటారు. ‘ఎకో’ కూడా ఆ తరహా కథే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే. దాన్ని ఆవిష్కరించిన నేపథ్యం కొత్తది. అది చివరి వరకూ మనకు తెలియదు.
‘ఎకో’తో దర్శకుడు మనల్ని అందమైన అడవుల్లోకి తీసుకెళ్తాడు.. ఎత్తయిన కొండ ఎక్కిస్తాడు.. మిలాతియా బామ్మ, ఆమె ఇల్లు.. ఆహా ప్రకృతి ఒడిలో ఎంత అందంగా ఉందనుకుంటాం. కానీ, అక్కడున్న కుక్కలు మొరిగే సీన్ క్లోజప్ పడితే గుండె ఝల్లుమంటుంది. భయం గ్రాముల్లో.. కిలోల్లో కాదు.. టన్నుల్లో అనుభూతి అవుతుంది. ఒకవైపు కురియాచన్ కోసం పోలీసులు సాగించే ఇన్వెస్టిగేషన్.. మరోవైపు మిలాతియా ఫ్లాష్ బ్యాక్.. ఇంకోవైపు మోహన్ పోతన్ హత్య ఇలా కథ ముప్పేట ప్రేక్షకుడిని ఊపిరి తీసుకోనివ్వదు. ముఖ్యంగా మలేషియా నేపథ్యంలో సాగే ఫ్లాష్‌బ్యాక్ ఉద్విగ్నంగా ఉంటుంది. కుక్కలు ఇంత క్రూరంగా ఉంటాయా? అనిపిస్తుంది. చివరి అరగంట సినిమాకు ఆయువు పట్టు. కథ, దాని వెనుక ట్విస్ట్‌లు ఒక్కోటి తెలుస్తుంటే, మిలాతియా బామ్మా మజాకా అనిపిస్తుంది. ఆమె దగ్గరకు పీయోస్ ఎందుకు చేరాడో తెలిపే ట్విస్ట్, ఆ క్రమంలో కుక్కలను చూపిస్తూ ఆ పాత్రను లాక్ చేసే సీన్ హైలైట్. అది తెరపై చూస్తేనే ఆసక్తికరం. సినిమా సన్నివేశాలన్నీ చైన్‌లింక్‌లా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మధ్యలో మిస్సయితే అర్థం కాదు. అడవిలోకి వెళ్లిన కురియాచన్ పాత్రను కూడా ఇంకాస్త తెరపై ఆవిష్కరిస్తే.. బాగుండేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
ఇందులో నటించిన వినీత్ ఒక్కడే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. మిగిలిన వాళ్లు పెద్దగా తెలియదు. కానీ, ఆ పాత్రల్లో వారు ఒదిగిపోయారు. పీయోస్‌గా సందీప్, మిలాతియా బామ్మగా బియానా మోమిన్.. కురియాచన్‌గా సౌరభ్ సచ్‌దేవ్ బాగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తక్కువ పాత్రలతో ఉత్కంఠ, కలిగించే కథ, కథనాలతో దింజిత్ అయ్యతన్ ‘ఎకో’ను నడిపిన తీరు బాగుంది. నిడివి సుమారు 2 గంటలు. మలయాళ కథలో ఉండే స్లోనరేషన్ ఇందులోనూ కనిపిస్తుంది. అది భరిస్తే, ‘ఎకో అనుభూతిని ఆస్వాదించవచ్చు.
కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉంది.
- బలాలు
- + కథ, దర్శకత్వం
- + నటీనటులు
- + క్లైమాక్స్
- బలహీనతలు
- - నెమ్మదిగా సాగే కథనం
- - కొన్ని పాత్రలకు సరైన జస్టిఫికేషన్ ఇవ్వకపోవడం
- చివరిగా: ‘ఎకో’..సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్
- గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Pratiroju 




