క్లిక్‌ చేసేముందు కాస్త ఆలోచించు బ్రో!

క్లిక్‌ చేసేముందు కాస్త ఆలోచించు బ్రో!

 ట్రాఫిక్‌ ఉల్లంఘనల పేరుతో నకిలీ చలానాలు పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్‌ కేటుగాళ్లు. వీరు పంపించే చలానాలు అసలు వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండడంతో ఎక్కువ మంది బోల్తా పడుతున్నారు. 

చిన్న మొత్తంతో ఎర వేసి..

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లఘించినందుకు మీ వాహనంపై చలానా పెండింగ్‌లో ఉందంటూ.. ట్రాఫిక్‌ పోలీసు, రవాణాశాఖ పేరుతో మోసగాళ్లు ఎస్‌ఎంఎస్, వాట్సప్‌ ద్వారా సందేశాలు పంపిస్తారు. వెంటనే జరిమానా మొత్తాన్ని చెల్లించాలని అందులో పేర్కొంటారు. చెల్లింపుల కోసం ఈ మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయమని సూచిస్తారు. 

  • ఇది నిజమైనదే అని నమ్మించడానికి అందులో తక్కువ మొత్తాన్నే చూపిస్తారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేస్తే.. నకిలీ వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది. అందులో డెబిట్, క్రెడిట్‌ కార్డుల నంబర్లు, ఓటీపీలు నమోదు చేయమని అడుగుతుంది. ఈ వివరాలు నమోదు చేసిన వెంటనే సైబర్‌ మోసగాళ్లు ఖాతా ఖాళీ చేసేస్తారు.  
  • కొన్ని సందేశాల్లో ఏపీకే ఫైళ్లను పంపిస్తుంటారు. జరిమానా సరిచూసుకునేందుకు, చెల్లించేందుకు దీనిపై క్లిక్‌ చేయమని అడుగుతారు. నిజమే అని నమ్మి క్లిక్‌ చేస్తే మొబైల్‌లోకి మాల్‌వేర్‌ ప్రవేశించడంతో పాటు దాని నియంత్రణ పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్తుంది. 

అసలైనదని బోల్తాపడి..

  • విజయవాడ నగరానికి చెందిన ఒక వ్యక్తికి వాట్సప్‌లో ట్రాఫిక్‌ ఉల్లంఘన పేరుతో ఈ-చలానా వచ్చింది. దానిపై క్లిక్‌ చేయగానే.. అతని క్రెడిట్‌ కార్డుల నుంచి విడతల వారీగా రూ.1.78లక్షలు మాయమయ్యాయి.  
  • నగరానికి చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌కు ఇటీవల గుర్తు తెలియని నంబరు నుంచి వాట్సప్‌లో ట్రాఫిక్‌ చలానా వచ్చింది. అది పెండింగ్‌లో ఉందని మరో మెసేజ్‌ వచ్చింది. దీంతో అందులో ఉన్న ఏపీకే ఫైల్‌పై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేశాడు. కొద్ది సేపటికే.. రెండు క్రెడిట్‌ కార్డుల నుంచి రూ.2.10 లక్షల లావాదేవీలు జరిగినట్లు సందేశం వచ్చింది. 

మాయగాళ్ల వలలో పడొద్దు

  • ట్రాఫిక్‌ ఉల్లంఘనల పేరుతో సెల్‌ఫోన్లకు వచ్చే చలానాలకు స్పందించొద్దు. ట్రాఫిక్‌ పోలీసు, ఆర్టీఏ పేర్లతో వచ్చే సందేశాల్లోని లింక్‌లపై క్లిక్‌ చేయొద్దు. 
  •  ఆ చలానా వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలోకి వెళ్లి సరిచూసుకోవాలి.
  •  బ్యాంకింగ్‌ వివరాలను అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దు. నకిలీ వెబ్‌సైట్లలో ఎట్టిపరిస్థితుల్లో నమోదు చేయొద్దు.