అమరావతి ఓఆర్‌ఆర్‌కు.. ఎన్టీఆర్‌ జిల్లాలో 1,416 హెక్టార్ల భూసేకరణ

అమరావతి ఓఆర్‌ఆర్‌కు.. ఎన్టీఆర్‌ జిల్లాలో 1,416 హెక్టార్ల భూసేకరణ

అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్‌) కోసం ఎన్టీఆర్‌ జిల్లాలోని కంచికచర్ల, వీరులపాడు, జి.కొండూరు, మైలవరం మండలాల్లోని 18 గ్రామాల్లో 1,416.31 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఈమేరకు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 1,798 సర్వే నంబర్ల నుంచి భూమిని సేకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో అధికారులు పేర్కొన్నారు. 21 రోజుల్లోపు ఎన్టీఆర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా... అభ్యంతరాలు, సూచనలు, సలహాలను సమర్పించాలని సూచించారు. ఈ ప్రక్రియ ముగిశాక నేషనల్‌ హైవేస్‌ యాక్ట్‌ 1956లోని సెక్షన్‌ 3(2) కింద తుది ఉత్తర్వులిస్తారు. సేకరించబోయే భూమిని చదరపు మీటర్లలో చూపారు. ఓఆర్‌ఆర్‌ కోసం గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ, మేడికొండూరు, కొల్లిపర, తెనాలి, వట్టిచెరుకూరు, గుంటూరు తూర్పు, పశ్చిమం మండలాల్లోని 4,763 సర్వే నంబర్ల పరిధిలో 2,342.87 హెక్టార్లు... కృష్ణా జిల్లా బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల పరిధిలోని 2,002 సర్వే నంబర్ల నుంచి 1,111.71 హెక్టార్ల సేకరణకు డిసెంబరు 8న రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మూడు జిల్లాల్లో 4,870.89 హెక్టార్లను ఓఆర్‌ఆర్‌ కోసం సేకరిస్తున్నారు.