విశాఖ ఈఎస్ఐ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల!
విశాఖపట్నంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి అనుబంధంగా 50 సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విశాఖలో ప్రస్తుతం 200 పడకల అనుమతితో ఆసుపత్రి కొనసాగుతోంది. దీన్ని 220 పడకలకు పెంచి, వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ఈఎస్ఐ కార్పొరేషన్ భావిస్తోంది. కార్పొరేషన్‌కు చెందిన మెడికల్ కమిషనర్ సప్నా మిత్తల్, డిప్యూటీ మెడికల్ కమిషనర్లు సుపర్ణ పోప్లి, బిలుంగ్ ఇ థెరెసాలతో కూడిన బృందం మంగళవారం విశాఖపట్నం ఆసుపత్రిని పరిశీలించింది. పోర్టు స్థలంలో లీజు ప్రాతిపదికన ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని రాష్ట్ర ఈఎస్ఐ విభాగం నిర్వహిస్తోంది. వైద్య కళాశాల ఏర్పాటుకు ఆసుపత్రిని తాత్కాలికంగా తమకు అప్పగించాలని కేంద్ర కార్పొరేషన్ కోరింది. అలా ఇస్తే మిగతా పడకలకు తాత్కాలికంగా నిర్మాణాలు చేసి, వైద్య కళాశాల పరిపాలన, వసతిగృహాలకు ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూస్తే 2026-27 విద్యా సంవత్సరంలో వైద్య కళాశాల వచ్చేందుకు అవకాశం ఉంటుంది. జాప్యం జరిగితే మరో ఏడాదికి వాయిదా పడుతుంది.


Pratiroju 




