పర్యాటక రంగంలో మరో కీలక ముందడుగు- ఎనిమిది చోట్ల హౌస్‌ బోట్లు!

పర్యాటక రంగంలో మరో కీలక ముందడుగు- ఎనిమిది చోట్ల హౌస్‌ బోట్లు!

రాష్ట్రం ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో కీలక ముందడుగు పడనుంది. పర్యాటకుల కోసం రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో త్వరలో హౌస్‌ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. పలు ప్రైవేట్‌ ఆపరేటర్లు ప్రధాన నదులు, జలాశయాల్లో వీటిని నిర్వహించేందుకు ముందుకొచ్చారు. గతంలో పలుచోట్ల రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హౌస్‌ బోట్లు ప్రారంభించినా నిర్వహణపరంగా ఇబ్బందులు తలెత్తాయి. వీటిలో కొన్ని బోట్లు మూలకు చేరాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రైవేట్‌ ఆపరేటర్ల ఆధ్వర్యంలో వీటి నిర్వహణకు ప్రభుత్వం అనుమతులిస్తోంది.

రూ.10 కోట్ల పెట్టుబడులతో నిర్వహణ: రాష్ట్రంలో 8 చోట్ల సింగిల్, డబుల్‌ బెడ్‌ రూం హౌస్‌ బోట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. సూర్యలంక, భవానీ ద్వీపం, రాజమహేంద్రవరంలోని సరస్వతీ ఘాట్, పుష్కర ఘాట్, వైఎస్సార్‌ కడప జిల్లా గండికోట, అనకాపల్లి జిల్లా కొండకాకర్ల సరస్సు, విశాఖపట్నం జిల్లా గంభీరం, అల్లూరి జిల్లా తాజంగి జలాశయాలు వీటిలో ఉన్నాయి. బోట్ల నిర్వహణకు వివిధ ప్రైవేట్‌ సంస్థలు ఎనిమిది చోట్లా కలిపి రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

విజయవాడలో కృష్ణా నది మధ్యలోని భవానీ ద్వీపంలో హౌస్‌ బోట్లను సీఎం చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు. టికెట్‌ బుకింగ్‌ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ద్వీపంలో రెండు హౌస్‌ బోట్లు, మరో రొమాంటిక్‌ ఫ్లోట్, డైన్‌ బోటు సిద్ధం చేశారు. తాజంగి, కొండకాకర్ల సరస్సు, గంభీరం జలాశయంలో బోట్ల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్ల ద్వారా పర్యావరణ, జలవనరుల పరిశీలనకు వెళ్లాయి. త్వరలో అనుమతులు రానున్నాయి. స్వర్ణాల చెరువు (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), గార్గేయపురం (కర్నూలు) ఎదుర్లంక (డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ)లోనూ బోట్ల నిర్వహణకు తాత్కాలిక అనుమతులివ్వనున్నారు.

రొమాంటిక్‌ ఫ్లోట్‌ బోట్‌: ఒక్కో బోటులో ఆరుగురికి సరిపడా సదుపాయాలు కల్పిస్తున్నారు. వీటిలో రాత్రులు బస చేయవచ్చు. నది ఒడ్డున జెట్టీ వద్ద వీటిని నిలిపి ఉంచుతారు. రొమాంటిక్‌ ఫ్లోట్, డైన్‌ బోటులో జన్మదినోత్సవాలు, వార్షికోత్సవాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అదే బోటుపై లంచ్, డిన్నర్‌లకు ఏర్పాట్లు చేయనున్నారు.

ప్రభుత్వ సహకారంతో సదుపాయాలు: బోట్ల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జెట్టీల ఏర్పాటుకు అవసరమైన స్థలం కేటాయిస్తున్నారు. విద్యుత్తు, తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.

కంట్రోల్‌ రూంలతో భద్రతా ఏర్పాట్లు: బోట్లలో ప్రయాణించే పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. బోట్లు నడిపే ప్రతిచోటా కంట్రోల్‌ రూం విధిగా ఉండాలని ప్రభుత్వం పర్యాటకశాఖను ఆదేశించింది. రెవెన్యూ, పోలీస్, జలవనరులశాఖ ఉద్యోగులు కంట్రోల్‌ రూంలో ఉంటారు. బోట్లలో భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా, లేదా? బోట్లు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో పరిశీలిస్తారు. నదులు, జలాశయాల్లో వరద ఉద్ధృతి ఉంటే బోట్ల నిర్వహణను నిలిపివేస్తారు.