'ఖమేనీపై దాడి అంటే యుద్ధమే'- అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు వార్నింగ్

'ఖమేనీపై దాడి అంటే యుద్ధమే'- అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు వార్నింగ్

అమెరికాకు ఇరాన్ అధ్యక్షుడు హెచ్చరిక- 4000కు చేరిన నిరసనల మృతుల సంఖ్య.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై దాడి చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తుందని అమెరికాకు దేశ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్​ హెచ్చరించారు. ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు అమెరికా, దాని మిత్రదేశాల విధించిన అమానుష ఆంక్షలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని చేప్పిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

'ఇరాన్ ప్రజలు జీవన కష్టాలు ఎదుర్కొంటున్నారంటే దానికి ప్రధాన కారణం అమెరికా ప్రభుత్వం, దాని మిత్రదేశాలు సంవత్సరాలుగా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలే” అని పేర్కొన్నారు. మన దేశ సుప్రీం లీడర్‌పై ఎలాంటి దాడి జరిగినా అది ఇరాన్ దేశంపై యుద్ధం ప్రకటించినట్టే. దీనిని మేము సహించబోం' అని పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు.

మరోవైపు నిర్బంధంలో ఉన్నవారికి ఉరిశిక్ష విధించే అంశంలో ముందుకెళుతామని ఇరాన్ న్యాయశాఖ అధికారి ప్రతినిధి తెలిపారు. కొన్ని కేసులను మోహరబ్‌ కింద నమోదు చేశామని వాటి విషయంలో చట్టం ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. ఇరాన్ చట్టంలో మోహరబ్‌ను దేవునిపై యుద్ధంగా పేర్కొన్నారు. మోహరబ్ కింద కేసు నమోదైతే ఇరాన్ చట్టం ప్రకారం ఉరిశిక్ష విధిస్తారు.

ఖమేనీ అధికారం నుంచి దిగాల్సిన సమయం వచ్చింది : ట్రంప్
ఆదివారం ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇరాన్‌ ప్రజలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. అక్కడ కొనసాగుతోన్న హింసకు ఖమేనీనే కారణమని ఆరోపించారు. నాయకుడి స్థానంలో ఉన్న ఖమేనీ వేలాది మంది ప్రజలను చంపుతూ, తన దేశాన్ని తానే నాశనం చేస్తున్నారని అన్నారు. ప్రజలు ఆయనకు నాయకత్వం కట్టబెట్టింది ఇటువంటి భయాలు, మరణాలు సృష్టించడానికి కాదని పేర్కొన్నారు. ఇంతమంది ప్రాణాలు తీసిన సుప్రీం లీడర్‌ ఇరాన్‌ను పాలించడానికి అనర్హుడని పేర్కొన్నారు. ఇక ఆయన అధికారం నుంచి దిగిపోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇరాన్‌కు కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

4వేల మంది మృతి
ఇదిలా ఉండగా, అమెరికాలో ఉన్న మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) తాజాగా విడుదల చేసిన గణాంకాలు కలవరపెడుతున్నాయి. ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలలో ఇప్పటివరకు కనీసం 3,919 మంది మరణించినట్లు సంస్థ ప్రకటించింది. శనివారం వెల్లడించిన 3,308 సంఖ్యతో పోలిస్తే మరణాలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సంస్థ అనుమానం వ్యక్తం చేసింది.1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో ఇది అత్యంత రక్తపాత కాలమని పేర్కొంది. దేశంలో ఉన్న కార్యకర్తల నెట్‌వర్క్ ఆధారంగా ఈ మరణాలను ధృవీకరిస్తున్నామని తెలిపింది. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక మరణాల సంఖ్యను వెల్లడించలేదు. అయితే శనివారం సుప్రీం లీడర్ ఖమేనీ తొలిసారిగా వేలాది మంది ఈ నిరసనల్లో మరణించినట్లు పరోక్షంగా చెప్పారు. ఈ హింసకు అమెరికానే కారణమని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 28 నుంచి బలహీన ఆర్థిక పరిస్థితులపై ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తితో ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు 24,669 మందిని అరెస్ట్ చేసినట్లు హెచ్​ఆర్​ఏఎన్​ఏ వెల్లడించింది.

ఇక ట్రంప్ తిరిగి వైట్ హౌస్‌కు వచ్చిన తర్వాత ట్రెహాన్-అమెరికా సంబంధాలు మరింత దిగజారాయి. 'మ్యాక్సిమమ్ ప్రెజర్' విధానాన్ని కొనసాగిస్తూ ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మరింత కఠినంగా మారాయి. మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్లకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్రలే కారణమని ఇరాన్ అధికారులు ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.