వచ్చే నెలలో పెళ్లి.. అమెరికా నిర్బంధంలో భారతీయ నేవీ అధికారి
రష్యా జెండాతో వెళ్తున్న వెనెజువెలా ‘మ్యారినెరా’ నౌకతో పాటు (Oil Tanker) మరో నౌకను అమెరికా సీజ్ చేసిన విషయం తెలిసిందే. మ్యారినెరా పేరుతో ఉన్న నౌక సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు రష్యా మీడియా ఇప్పటికే వెల్లడించింది. వారు హిమాచల్ ప్రదేశ్, కేరళ, గోవాకు చెందినవారు కాగా.. హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు చెందిన రిక్షిత్ చౌహాన్ మర్చంట్ నేవీ ఆఫీసర్. వచ్చే నెల ఆయన వివాహం జరగాల్సి ఉంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
చౌహాన్ (Rikshit Chauhan)ను రష్యా సంస్థ తొలిసారి సముద్రంపై విధులకు పంపింది. అది కూడా వెనెజువెలాకు. జనవరి ఏడున చివరిసారి చౌహాన్‌తో మాట్లాడామని ఆయన కుటుంబం వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా దళాలు నౌకను సీజ్ చేశాయి. ‘‘మా కుమారుడు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడండి’’ అని రక్షిత్ తల్లి రీతాదేవి ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఫిబ్రవరి 19న తన కొడుకు వివాహాన్ని నిశ్చయించామని చెప్పారు.
‘‘రక్షిత్ 2025లో రష్యా (Russia) సంస్థలో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా చేరాడు. కొన్నిరోజుల క్రితం చివరిసారి మాట్లాడినప్పుడు అంతా బాగానే ఉందన్నాడు. వెనెజువెలాలో అమెరికా మిలిటరీ చర్య కారణంగా వెంటనే ఆ దేశం నుంచి తిరిగిరావాలని రష్యా సంస్థ సూచించినట్లు చెప్పాడు. ఇంతలో తమ కుమారుడు ఉన్న షిప్ సీజ్ అయిందని జనవరి 10న మాకు తెలిసింది’’ అని చౌహాన్ తండ్రి వెల్లడించారు. ఈ పరిణామాలపై ఇప్పటికే విదేశాంగ శాఖ స్పందించింది. అందులో ఉన్న భారతీయుల వివరాలను నిర్ధరిస్తున్నట్లు చెప్పారు. నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా.. వారిలో ఉక్రెయిన్, జార్జియా, రష్యన్ పౌరులు ఉన్నట్లు సమాచారం.


Pratiroju 




