అమెరికాలో వలసలను 10 ఏళ్లు నిలిపివేయాలి: ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్
ఇంటర్నెట్డెస్క్: అమెరికాకు 10 ఏళ్లపాటు వలసలు నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ అన్నారు. ఇమిగ్రేషన్ వ్యవస్థలో భారీగా అవినీతి పేరుకుపోయిందని వ్యాఖ్యానించారు. శరణార్థి, క్షమాభిక్ష, ఆశ్రయం కల్పించే కార్యక్రమాలు పూర్తిగా అవినీతిమయం అయ్యాయని విమర్శించారు. ఈమేరకు తన వార్రూమ్ షోలో మాట్లాడారు. అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులతో కంపెనీలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయని హెచ్-1బీ వీసా (H-1B visa) కార్యక్రమం గురించి పేర్కొన్నారు.
వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తోన్న ట్రంప్ ప్రభుత్వం శరణార్థులకు, వలసదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల కాలవ్యవధిని కుదిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా తీసుకువస్తోన్న కొత్త విధానాలతో హెచ్-1బీ దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురవుతోంది. వీసా అపాయింట్మెంట్లు వాయిదా వేయడంతో వచ్చే ఏడాది అక్టోబరు వరకు వారు ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది. హెచ్-1బీ వీసా(Visa) ఫీజును లక్ష డాలర్లకు యూఎస్ ప్రభుత్వం పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలన్నింటిని సరిదిద్దాలంటూ బానన్ వ్యాఖ్యలు చేశారు.


Pratiroju 




