ఈనెల 23, 24 తేదీల్లో జరగనున్న జాతీయ మహాసభ- పునఃస్మరణ సదస్సు

ఈనెల 23, 24 తేదీల్లో జరగనున్న జాతీయ మహాసభ- పునఃస్మరణ సదస్సు

విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ మహాసభ- పునఃస్మరణ సదస్సు - ఈనెల 23, 24 తేదీల్లో జరగనున్న జాతీయ మహాసభ- పునఃస్మరణ సదస్సు - సదస్సులో పాల్గొననున్న పార్టీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు.

విజయవాడ వేదికగా రెండు రోజులపాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ మహాసభ పునఃస్మరణ సదస్సు జరగనుంది. ఈనెల 23, 24 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇందిరిగాంధీ మున్సిపల్‌ స్టేడియం ప్రాంగణాన్ని కృష్ణదేవరాయనగర్‌గా నామకరణం చేయబోతున్నారు. పార్టీ జాతీయ నాయకులతోపాటు కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా వీడియో సందేశం ద్వారా ప్రసంగించనున్నారు.

1965 జనవరి 23, 24 తేదీల్లో విజయవాడలో జనసంఘ్‌ మహాసభలు జరిగాయి. వాటి స్మృతులను గుర్తుకు చేసుకునేలా ఈనెల 23, 24 తేదీల్లో ఏకాత్మ మానవదర్శన్‌ పేరిట జాతీయ మహాసభల పునఃస్మరణ సదస్సు నిర్వహణకు భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానం ఉన్న ప్రాంగణంలోనే 60 ఏళ్ల క్రితం అంటే 1965లో భారతీయ జనసంఘ్‌ సదస్సు జరిగింది. జనసంఘ్‌ మాజీ అధ్యక్షులు పండిత్ దీనదయాళ్‌ ఉపాధ్యాయ- ఏకాత్మ మానవ దర్శనాన్ని అధికారిక మార్గదర్శక సిద్ధాంతంగా ప్రకటించారు. నేటికీ బీజేపీ అధికారిక తాత్విక సిద్ధాంతంగా ఇది కొనసాగుతోంది.

కృష్ణదేవరాయనగర్‌గా ఇందిరాగాంధీ మైదానం : భారతీయ జనతా పార్టీకి మాతృసంస్థ భారతీయ జనసంఘ్‌. మనిషి జీవితం అనేది వ్యక్తి, సమాజం, ప్రకృతి, పరమాత్మల కలయిక అని వీటి మధ్య సమతుల్యత ఉండాలనేది ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతం ఉద్దేశ్యం. సమాజంలో చివరి వరుసలోని వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనేదే ఈ సిద్ధాంతం ప్రధాన లక్ష్యం. ఈ సిద్ధాంతాన్ని విజయవాడలోనే 60 ఏళ్ల క్రితం ప్రకటించినందున అదే రోజున రెండు రోజులపాటు సదస్సులు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం అప్పుడు ఏ విధంగా ఈ ప్రదేశానికి నామకరణం చేశారో అదే పేరును కృష్ణదేవరాయనగర్‌గా ఇందిరాగాంధీ మైదానంలోని సదస్సు ప్రాంగణానికి పేరు పెట్టాలని నిర్ణయించారు.

చిత్రపటాలు, కథనాలు, ప్రదర్శనలు : అప్పట్లో సదస్సు నిర్వహించిన నాటి చిత్రపటాలు, తమ సంస్థాగత పత్రిక జాగృతిలో ప్రచురించిన కథనాలు, ఇతర వివరాలతో కూడిన ఫొటో ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, ఇతర కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, సీనియర్‌ నేతలు రామ్‌మాధవ్‌, మురళీధరరావు తదితరులు హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా వీడియో సందేశం ద్వారా ప్రసంగించనున్నారు.

ప్రధాన లక్ష్యాలుగా నిర్ణయించిన బీజేపీ : పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఇంటిగ్రల్‌ హ్యూమనిజం సిద్ధాంతాన్ని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పునఃసమీక్షించడం, భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం ఈ రెండు రోజుల సదస్సు ప్రధాన లక్ష్యాలుగా బీజేపీ నిర్ణయించింది. రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కోణాలతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సదస్సులో చర్చించనున్నారు. సదస్సు ప్రాంగణంలో కేంద్రంలో బీజేపీ పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్యవేక్షిస్తున్నారు. జాతీయస్థాయి అగ్రనేతలను మాధవ్‌తోపాటు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఇతర నేతలు ఆహ్వానించేందుకు దిల్లీలో పర్యటిస్తున్నారు.