చంద్రబాబు దావోస్ పర్యటన
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు - సీఎంను మర్యాద పూర్వకంగా కలిసిన అసోం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వశర్మ, ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా.
దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యూరిక్ చేరుకున్నారు. విమానాశ్రయంలో స్విట్జర్లాండ్‌ల్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు. అలాగే సీఎం చంద్రబాబును సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, అసోం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వశర్మ, ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ముఖ్యమంత్రికి జ్యూరిక్ విమానాశ్రయంలో తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యూరప్‌లోని 20కి పైగా దేశాల నుంచి తెలుగు ప్రజలు, ఎన్ఆర్ఐలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో సీఎం చంద్రబాబు: మరోవైపు ఏపీ మంత్రి నారా లోకేశ్ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ చేరుకున్నాక విమానాశ్రయం వద్ద ఆయనకు ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు లోకేశ్ అక్కడి నుంచి దావోస్‌కు వెళ్లనున్నారు. ఏపీని నమ్మకమైన గ్లోబల్ గమ్యంగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 90వ దశకంలోనే భారత్‌కు తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో సీఎం చంద్రబాబు ఒకరని పేర్కొన్నారు.


Pratiroju 




