జగ్గన్నతోట ప్రభల తీర్థం- 11 మంది ఏకాదశ రుద్రులు కనుమరోజు ఒకేచోట కొలువుదీరే అరుదైన దృశ్యం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జాతీయస్థాయి ప్రసిద్ధి గాంచిన జగ్గన్నతోట ప్రభల తీర్థానికి సర్వం సిద్ధమైంది. 476 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభల తీర్థానికి ప్రభుత్వం రాష్ట్ర పండగ హోదా కల్పించడంతో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. నేటి ప్రభల ఉత్సవాన్ని తిలకించేందుకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ శివారులోని జగ్గన్న తోట ప్రభల తీర్థానికి ప్రధాన వేదిక. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11 మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కొలువు తీరాలనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి కనుమ పండగ రోజు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, కె. పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు నుంచి చెన్నమనేశ్వర స్వామి, ముక్కామల నుంచి రాఘవేశ్వర స్వామి, మొసలిపల్లి నుంచి భోగేశ్వర స్వామి, పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వరస్వామి, గంగలకుర్రు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభలు ఊరేగింపుగా జగ్గన్న తోటకు తరలిరానున్నాయి. 11 మంది ఏకాదశి రుద్రలు లోక కళ్యాణం కోసం చర్చ జరుపుతారని అందుకే కోనసీమ ప్రాంతం సుభిక్షంగా ఉందని స్థానిక ప్రజల నమ్మకం.


Pratiroju 




