కలిసొచ్చిన సంక్రాంతి - పర్యాటక రంగంలో పెట్టుబడుల ఆకర్షణ
పర్యాటకులలో ఉత్సాహం నింపిన ఎస్.యానం బీచ్ ఫెస్టివల్స్, రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు - అందరినీ అలరించిన ఆత్రేయపురంలో జరిగిన కేరళ తరహా జాతీయ స్థాయి పడవ పోటీలు
గోదావరి పరవళ్లు, పచ్చని పైరుల సింగారాలు, రోడ్డుకిరువైపులా స్వాగతం పలికే కొబ్బరి చెట్లు విశాల సముద్ర తీరంతో పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. జిల్లా జీడీపీలో పర్యాటక రంగమే కీలకంగా మారిన నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సంక్రాంతిని అధికారులు, ప్రజాప్రతినిధులు వేదికగా చేసుకున్నారు. ఓ వైపు పడవ పోటీలు, ఎస్.యానంలో బీచ్ ఫెస్టివల్స్, రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు పర్యాటకులలో ఉత్సాహం నింపాయి. మరో వైపు ప్రభల తీర్థంతో ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను దేశానికి చాటి చెప్పాయి.
మరిన్ని చర్యలకు ప్రణాళికలు: కేరళ తరహాలో జాతీయ స్థాయి పడవ పోటీలను ఆత్రేయపురంలో నిర్వహించారు. జలక్రీడలకు ఇక్కడున్న వనరులు, వసతులను దేశానికి పరిచయం చేశారు. ఈ పోటీల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 22 జట్లు పాల్గొనగా స్థానికంగా ఇక్కడ ఈ రంగం అభివృద్ధికి మరిన్ని చర్యలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శాప్ పర్యవేక్షణలో ఈ రంగంలోని క్రీడాకారులను గుర్తించి స్థానికంగా శిక్షణ ఇచ్చే అవకాశాలపై ఆలోచిస్తున్నారు. గతానికి భిన్నంగా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చడం విశేషంగా నిలిచింది. ఈ ప్రాంతంలో లొల్లలాకులు, ఇతర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి.
ఆంధ్రా గోవా: ఆంధ్రా గోవాగా పేరుగాంచిన ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం సముద్ర తీరంలోనూ బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. జెట్టీల ఏర్పాటుతోపాటు బోటింగ్, జలక్రీడలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడ సినిమాల చిత్రీకరణను ప్రోత్సహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతర్వేదిలో ప్రైవేటు వ్యక్తుల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేస్తున్నా దీన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు హోం స్టే అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అలాగే కోనసీమలో ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థాన్ని ఈ ఏడాది అధికారిక పండగగా సర్కారు గుర్తించింది. ఇది పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుందని, బాహ్య ప్రంపంచానికి తెలియజేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టాక ప్రతి రంగంలోనూ తన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తోంది.
దేశీయ పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు:
దేఖో అప్నా దేశ్: మధ్యతరగతి ప్రజలు విదేశీ పర్యటనలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా మెరుగైన సదుపాయాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
స్వదేశ్ దర్శన్: దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 76 ప్రాజెక్టులను పర్యాటక రంగ అభివృద్ధి కోసం గుర్తించి, కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ సహకారంతో మౌలిక సదుపాయాలను కల్పిస్తారు.
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, నాణ్యత, రక్షణ విధానాలను అనుసరిస్తున్న అత్యుత్తమ బీచ్‌లకు డెన్మార్క్‌కు చెందిన "ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్" సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఇస్తుంది. విశాఖలోని రుషికొండ బీచ్‌కు ఈ గుర్తింపు లభించింది.


Pratiroju 




