ఖాతా ఖాళీ చేయలేరు..

ఖాతా ఖాళీ చేయలేరు..

 కవిటి గ్రామీణం: పంచాయతీల పాలకవర్గాల గడువు ఏప్రిల్‌ నాటికి ముగియనుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న ఉద్దేశంతో కొందరు సర్పంచులు పంచాయతీ ఖాతాల్లోని నిధులు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నిచోట్ల కార్యదర్శులతో కుమ్మక్కవుతున్నారు. కొందరు ఒప్పుకోకపోతే వారిపై ఒత్తిడి తెస్తున్నారు. విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి బిల్లులు పెట్టొద్దని పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయం మౌఖిక ఆదేశాలిచ్చింది. నిధుల వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసింది.

నిబంధనలకు పాతరేసి..

జిల్లాలో 30 మండలాల్లో 912 గ్రామ పంచాయతీలున్నాయి. ఆర్థిక సంఘం నిధుల్లో 30 శాతం పారిశుద్ధ్యం, 30 శాతం తాగునీటి సరఫరా, మిగతా 40 శాతం ఇతరత్రా పనులకు వెచ్చించాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధుల్ని కొందరు సర్పంచులు ఇష్టారీతిన విత్‌డ్రా చేసేశారు. చిన్నపాటి పనులకు పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టడం, వీధి దీపాలు, విద్యుత్తు ఉపకరణాలు తదితరాలకు నకిలీ రసీదులు పెట్టి నిధులు పక్కదారి పట్టించారు. గుప్పెడు బ్లీచింగ్‌ చల్లకపోయినా ప్రతి నెలా పారిశుద్ధ్యం పనులు చేస్తున్నట్లు బిల్లులు అప్‌లోడ్‌ చేసి నగదు కాజేశారు. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఏం చేయాలంటే..

  • 2025 డిసెంబరు వరకు క్లాప్‌ మిత్రలకు బకాయిల్లేకుండా పూర్తిగా వేతనాలు చెల్లించాలి.
  • వీధి దీపాలకు ఎల్‌ఈడీ ప్రాజెక్టులో భాగంగా ఈఈఎస్‌ఎల్, ఎన్‌ఆర్‌ఈడీ సీఏపీ త్రైమాసిక వాయిదాలు చెల్లించాలి.
  • తాగునీటి సరఫరా పథకాలకు అత్యవసర మరమ్మతులు చేయించాలి. విద్యుత్తు మోటార్లు, వీధి దీపాల విద్యుత్తు ఛార్జీలు చెల్లించాలి.
  • జనవరి 5, 6 తేదీల్లో గ్రామసభలు నిర్వహించాలి. చెత్త రహిత గ్రామాలుగా ప్రకటించాలి. ఆర్థిక సంఘం నిధులు వినియోగంపై సభలో చర్చించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అందరికీ తెలియజేశాం..

ప్రభుత్వ ఉత్తర్వులను పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు పంపించాం. దీనిపై వారికి సమావేశాల్లో అవగాహన కల్పించడంతోపాటు నిధుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని కార్యదర్శులకు తెలియజేశాం. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.