మార్చి నాటికి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ: చంద్రబాబు

మార్చి నాటికి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ: చంద్రబాబు

‘సంజీవని’ ద్వారా జులై నాటికి 66 లక్షల హైరిస్క్‌ కేసుల హెల్త్‌ స్క్రీనింగ్‌ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అధికారులను ఆదేశించారు. కేర్‌ అండ్‌ గ్రో ద్వారా మాతాశిశు ఆరోగ్యం, పెరుగుదల వివరాలు నమోదు చేయాలని చెప్పారు. జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారంపై సోమవారం సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

‘‘మాతాశిశువులకు పౌష్టికాహారంతోపాటు సప్లిమెంట్స్‌ అందించేలా చర్యలు తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందేలా చూడాలి. సాధారణ ప్రసవాలు పెరిగేలా, సిజేరియన్లు తగ్గేలా చూడాలి. 60 ఏళ్లు దాటితే ఏ పనీ చేయలేమన్న సైకాలజీని ప్రజల్లో మార్చాలి. వివిధ వర్గాలతో అధికారులు మాట్లాడితే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్‌ సిస్టం ద్వారా జూన్‌ నాటికి సమగ్ర కార్డులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. వచ్చే ఏడాది ఎయిడ్స్‌ ఫ్రీ ఏపీగా డిక్లేర్‌ చేస్తాం.

జనాభా విషయంలో చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగింది. యూరప్‌లోని 20 దేశాల్లో ఏజింగ్‌ సమస్యతో సామాజిక వేడుకలు లేవు. ఏపీలో మార్చి నాటికి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ తీసుకొస్తాం. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాలి. పరీక్షలంటే విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలి’’ అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.