భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్ర దశ - దిశ మారబోతోంది: సీఎం చంద్రబాబు
అమరావతి: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘2014 - 2019 మధ్య కాలంలో ఈ విమానాశ్రాయ నిర్మాణం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. ఈ ఏడాది జూన్ నాటికి మిగిలిన 4 శాతం పనులు కూడా పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. గడిచిన 18 నెలల్లో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. భోగాపురం ఎయిర్ పోర్టు ఆ ప్రాంత కనెక్టివిటీ పెంచి అభివృద్దికి దోహద పడుతుంది. పోర్టులు, ఎయిర్ పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోంది. అన్ని ప్రాంతాల సమగ్రఅభివృద్దికి సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోరుకుంటూ....ఈ శుభసందర్భాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నా’’ అని చంద్రబాబు పోస్టు పెట్టారు.
ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు: మంత్రి లోకేశ్
‘‘భోగాపురానికి వాలిడేషన్ ప్లైట్ రాకతో ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు వచ్చినట్లు అయింది. ఆ ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుంది. కనెక్టివిటీ పెరుగుదల సహా ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ఇది బలమైన పునాది. ఈ ప్రాజెక్టుకు దూరదృష్టితో మార్గనిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ ఏడాది జూన్ నుంచి వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం కానుంది’’ అని లోకేశ్ వెల్లడించారు.
గేమ్ ఛేంజర్: బీసీ జనార్దన్ రెడ్డి
‘‘భోగాపురం విమానం ల్యాండింగ్ ఏపీ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్. వాలిడేషన్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషకరం. రాష్ట్ర విమానాయానరంగంలో ఇది చరిత్రాత్మక ఘట్టం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ఎంతో దోహదపడుతుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారతాయి’’ అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.


Pratiroju 




