'వృద్ధులతో గడపడం సంతోషంగా ఉంది' - కారంచేడులో రామ్​-లక్ష్మణ్​ల సందడి

'వృద్ధులతో గడపడం సంతోషంగా ఉంది' - కారంచేడులో రామ్​-లక్ష్మణ్​ల సందడి

రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా వృత్తిరిత్యా పలు ప్రాంతాల్లో నివసిస్తున్నవాళ్లు సైతం సొంతూరు బాట పట్టారు. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన ప్రముఖ సినీ ఫైట్​మాస్టర్లు స్వగ్రామంలో సందడి చేశారు. శక్తిమంతమైన పోరాట ఘట్టాలతో ప్రేక్షకుల్ని రంజింపజేయడంలో అందెవేసిన చేయి రామ్‌ - లక్ష్మణ్‌లది. పండుగ వేళ మంచి పనులు చేయాలి, నలుగురికి సాయం చేయాలంటూ అందరి మనసులు దోచుకున్నారు.

మనలోని చెడును వదలి, మంచిగా జీవితం గడిపితే అదే జన్మకు సార్థకతని చేకూరుస్తుందని ప్రముఖ సినీ ఫైట్​ దర్శకులు రామ్ లక్ష్మణ్​లు అన్నారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామం కారంచేడు మండలం నందిగొండపాలెంకు రామ్​, లక్ష్మణ్​లు వచ్చారు. ఈ నేపథ్యంలో చీరాలలోని కోటయ్య వృద్దాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందచేశారు.

'మేము ప్రతీ సంవత్సరం ఇక్కడికి వస్తాం. వృద్ధులతో సమయం గడపడం సంతోషంగా ఉంది. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఇలా నలుగురికి పంచి పెడితే తృప్తిగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా బెదరకుండా అందరూ నవ్వుతూ ఉండాలి. మీకు మేం ఎల్లప్పుడూ అండగా ఉంటాం.' -రామ్, లక్ష్మణ్, సినీ ఫైట్​ మాస్టర్లు