పట్నా హైకోర్టులో సరికొత్త రికార్డు- ఒకే రోజులో 510 కేసుల విచారణ
ట్నా హైకోర్టులో ఒకే రోజు 510 బెయిల్ కేసులు విచారణ- 475 కేసులకు తక్షణమే పరిష్కారం- హైకోర్టు జడ్జిపై ప్రశంసలు
పట్నా హైకోర్టులో సోమవారం రికార్డు స్థాయిలో కేసులపై విచారణ జరిగింది. ఏకంగా 510 కేసులను ఒకే రోజులో విచారణ జరిపి, హైకోర్టు చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. సోమవారం (జనవరి 19) జస్టిస్ ఆర్పీ మిశ్రా ఏకసభ్య ధర్మాసనం మద్యనిషేధ చట్టానికి సంబంధించిన కేసులపై విచారణ జరిపింది.
బద్దలైన పాత రికార్డు
పట్నా హైకోర్టు చరిత్రలో ఇప్పటివరకు ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో కేసులపై విచారణ జరిగిన దాఖలాలు లేవు. గతంలో ఒక రోజు 500 కంటే తక్కువ కేసులపై మాత్రమే విచారణ జరిగిన రికార్డు ఉంది. సోమవారం జస్టిస్ ఆర్పీ మిశ్రా ఏకసభ్య ధర్మాసనంలో మొత్తం 510 కేసులు విచారణకు జాబితా చేశారు. దీంతో సోమవారం సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది.
'475 కేసులకు తక్షణమే పరిష్కారం'
జాబితాలో ఉన్న అన్ని కేసులను పట్నా కోర్టు సోమవారం విచారణకు పిలిచింది. న్యాయవాదులు హాజరు కాని కేసులను తదుపరి రోజుకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు హాజరైన కేసులన్నింటిపై విచారణ పూర్తి చేసింది. మొత్తం 475 కేసులను అదే రోజు పరిష్కారించింది.
కేసుల నిర్వాహణలో ప్రభుత్వ న్యాయవాదుల పాత్ర
కేసుల వేగవంతంగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీలు) చౌబే జవాహర్, రేణు కుమారి, నిత్యానంద్ తివారీ ముఖ్య పాత్ర పోషించారు. ఏపీపీల బృందం పెద్ద పరిమాణంలో ఉన్న కేసు డైరీలను చదివి, నిందితుల వివరాలను కోర్టుకు స్పష్టంగా తెలియజేశారు. దీంతో కోర్టు త్వరితగతిన ఆదేశాలు జారీ చేయగలిగింది. విచారణ సమయంలో కేసు డైరీలు, అందుకు సంబంధించిన వాస్తవాలు, నిందితుల క్రిమినల్ హిస్టరీ వంటి ప్రతి అంశాన్ని సవివరంగా పరిశీలించామి ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో కోర్టు త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం లభించిందని చెప్పారు.
జస్టిస్ ఆర్పీ మిశ్రాపై ప్రసంశలు
పట్నా హైకోర్టులో జరిగిన ఈ రికార్డు స్థాయి విచారణపై న్యాయవర్గాల్లో విస్తృతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జస్టిస్ ఆర్పీ మిశ్రా ఒకే రోజులో 510 కేసులపై విచారణ జరిపి, ఒక వైపు బాధితులకు ఊరట కల్పించగా,మరోవైపు ఇతర న్యాయమూర్తులకు ఒక ఆదర్శంగా నిలిచారు. ఈ విధమైన చర్యలతో న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల భారం భవిష్యత్తులో గణనీయంగా తగ్గే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కర్ణాటక హైకోర్టులో ఒకే రోజు 600 కేసుల విచారణ
గతేడాది జూన్‌లో కర్ణాటక హైకోర్టు కూడా ఒకే రోజులో ఏకంగా 600 కేసులను విచారణ జరిగింది. బెంగళూరు ప్రిన్సిపల్ బెంచ్‌ను ఈ కేసులను విచారించింది. ఆ రోజు జస్టిస్ నాగ ప్రసన్న ధర్మాసనానికి మొత్తం 600 పిటిషన్లు జాబితాలో ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ జరిపారు. ఈ 600 కేసుల్లో 180 పిటిషన్లకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మరో 87 కేసులను పూర్తిగా విచారించి, తుది నిర్ణయంతో ముగించారు. మిగిలిన పిటిషన్లను తదుపరి విచారణకు వాయిదా వేశారు. అయితే ఇలా విచారించడం తొలిసారి ఏం కాదు. 2025 జనవరి 22న ఒకే రోజులో 801 కేసులను విచారించారు. ఆ రోజు 36 పిటిషన్లను తీర్పు కోసం రిజర్వ్ చేశారు. దాదాపు 572 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. అందులో 544 కేసులు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB)కు సంబంధించినవే కావడం గమనార్హం. అలాగే 2023 జూన్ 12 ఒకే రోజులో 522 కేసులను విచారించి అప్పట్లోనే రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును ఆయన తానే పలుమార్లు అధిగమించారు. అంతకు కొద్ది నెలల ముందు కూడా ఒకే రోజులో 480కిపైగా కేసులను విచారించిన సందర్భాలు ఉన్నాయి.


Pratiroju 




