అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభం

అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభం

అమరావతి: రాజధాని అమరావతి(Amaravati)లో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు. అమరావతి మండలం ఎండ్రాయిలో సాయంత్రం గ్రామసభ నిర్వహించనున్నారు.

తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం 16,666.57 ఎకరాలు సమీకరించనుంది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం ఇప్పుడు భూసమీకరణ చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడానగరం, స్మార్ట్‌ పరిశ్రమలు, రైల్వేట్రాక్, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కోసం ఈ భూములు తీసుకుంటోంది.

రైతులకు స్థలాలు కేటాయించే లేఔట్ల అభివృద్ధికి అథారిటీ ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. లేఔట్లలో మొదట రెండు వరుసల రహదారులు, విద్యుత్‌ లైన్లు వేసి వీలైనంత త్వరగా రైతులకు స్థలాలు అప్పగించనుంది.