‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ (Battle of Galwan)’పై చైనా మీడియా వెళ్లగక్కిన అక్కసుకు భారత్ గట్టిగా బదులిచ్చింది. సినిమాలను తెరకెక్కించే విషయంలో దర్శకనిర్మాతలకు కళాత్మక స్వేచ్ఛ ఉంటుందన్న విషయాన్ని పొరుగు దేశానికి (China) గుర్తుచేసింది.
‘‘భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. తమ భావాలను కథల రూపంలో వ్యక్తపర్చడం కూడా ఇందులో అంతర్భాగమే. కళాత్మక స్వేచ్ఛకు అనుగుణంగా సినిమాలను తెరకెక్కించే హక్కు దర్శకనిర్మాతలకు ఉంటుంది. ఈ సినిమా (బ్యాటిల్ ఆఫ్ గల్వాన్) విషయంలో ఎవరికైనా (చైనాను ఉద్దేశిస్తూ) సందేహాలు గానీ, ఆందోళన గానీ ఉంటే.. స్పష్టత కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించొచ్చు. ఈ చిత్రం విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదు’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. చైనాపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ నోరుపారేసుకుంది. ఈ చిత్రం జాతీయవాద మెలోడ్రామా అని ఆరోపించిన చైనా.. గల్వాన్‌లో ఘర్షణలకు భారత బలగాలే కారణమంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
2020 జూన్‌లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ సంఘటన ఆధారంగానే ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల సల్మాన్ (Salman Khan) పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ విడుదల చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది.


Pratiroju 




