మిర్చి మిలమిల-పెరుగుతున్న ధరలు

మిర్చి మిలమిల-పెరుగుతున్న ధరలు

దేశీయంగా డిమాండ్‌ బాగుండడం, కారంపొడి కంపెనీలు కొనుగోళ్లకు ముందుకు రావడంతో మిర్చి ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం గుంటూరు యార్డులో దేవనూరు డీలక్స్‌ ధర క్వింటా రూ.20,500కు చేరుకుంది. గత వారంతో పోలిస్తే కనిష్ఠంగా రూ.1,500.. గరిష్ఠంగా రూ.3 వేల వరకు పెరుగుదల నమోదైంది. తాజా పరిణామాలతో రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది. గత సీజన్‌లో ధరలు బాగా పతనమైన సంగతి తెలిసిందే. 

కొత్త మిర్చికి మంచి ధర పలుకుతోంది. గత సీజన్లో ధర లేక చాలామంది రైతులు శీతల గోదాముల్లో నిల్వ చేశారు. పాత మిర్చికి కూడా ధరలు బాగుండడంతో విక్రయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు.  

పైపైకి.. తేజ, ఆర్మూర్‌ రకాలు తప్ప మిగిలిన రకాల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మిర్చియార్డుతో పాటు ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ పరిధిలోని శీతల గిడ్డంగుల్లో 26,10,729 బస్తాలు నిల్వ ఉన్నాయి. 

విదేశీ ఎగుమతులు తగ్గి...

  • ప్రస్తుతం విదేశీ ఆర్డర్లకంటే.. దేశీయంగా కొనుగోళ్లు బాగున్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.  
  • గత సీజన్‌లో చైనాకు రికార్డుస్థాయిలో ఎగుమతి చేశారు. ఈసారి కొంతమేర తగ్గాయి.
  • బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా ఎగుమతులు తగ్గాయి.
  • శ్రీలంక, సింగపూర్, మలేసియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ దేశాలకు ఓ మోస్తరుగా ఉన్నాయి.  
  • భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాతో దేశంలోని వివిధ రాష్ట్రాల స్టాకిస్టులు కొనుగోళ్లకు ముందుకొస్తున్నారు. కారంపొడి వ్యాపారులు సైతం మిర్చిని కొంటున్నారు. 

తగ్గిన సాగు...

  • మన రాష్ట్రంలో 2024-25లో 1,96,153 హెక్టార్లలో మిర్చి సాగు చేయగా.. 2025-26లో 1,08,223 హెక్టార్లకే పరిమితమైంది. 
  • తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ సాగు తగ్గింది. గతేడాది ధరలు పతనం కావడమే కారణం.