అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహుడి కల్యాణం - నేడు స్వామివారి రథోత్సవం
రథసప్తమి నుంచి మాఘ బహుళ పాడ్యమి వరకూ కల్యాణ వేడుకలు - భారీగా తరలివచ్చిన భక్తజనం
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా సాగింది. పరిణయ ఘట్టాలను పండితులు శాస్త్రోక్తంగా వివరిస్తూ భక్తిశ్రద్ధలతో తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. నవ నరసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. గోవింద, లక్ష్మీ నరసింహ అంటూ గోదావరి సాగర సంగమ క్షేత్రం మార్మోగింది. నేడు స్వామి వారి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీ, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన వేదికపై ప్రతిష్ఠించారు. విశ్వక్ సేన, ఆవాహనం, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు ఇలా పరిణయోత్సవంలోని వివిధ ఘట్టాలు, శాస్త్రోక్తంగా వేద పండితులు వివరించారు. అర్థరాత్రి ఒంటిగంట 56 నిమిషాలకు ఉత్సవ మూర్తులకు కల్యాణ వేడుక నిర్వహించారు.
అమలాపురం ఎంపీ హరీష్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తోపాటు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర అధికారులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తో పాటు అన్నవరం దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించారు.
రథోత్సవానికి ఏర్పాట్లు : కల్యాణం జరిగిన మరుసటి రోజు స్వామి, అమ్మవార్ల దివ్యమూర్తులకు రథోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయానికి సమీపంలోని మెరకవీధిలో సిద్ధం చేసిన రథాన్ని పలురకాల పూలు, అరటి గెలలు, వివిధ అలంకారాలతో తీర్చిదిద్దారు. గురువారం మధ్యాహ్నం 2.05 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. ప్రత్యేక పోలీసు బందోబస్తు సిద్ధమైంది. గుర్రాలక్కమ్మ ఆలయం నుంచి పదహారు కాళ్ల మండపం వరకు రథోత్సవం జరగనుంది.
కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం : అంతర్వేది త్రికోణాకారపు దీవిలో వెలసి ఉంది. ఈ పుణ్యతీర్థం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. అతి ప్రాచీనమైన అంతర్వేది ఆలయంలో నరసింహ స్వామి లక్ష్మీ సమేతుడై కొలువు తీరారు. పురాణాల ప్రకారం కాశీకి వెళ్లలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్లి వస్తే చాలని అంటారు. అందుకే అంతర్వేది దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందింది. లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు.


Pratiroju 




