ఘనంగా 3వ ప్రపంచ తెలుగు మహా సభలు - 42 దేశాల నుంచి తరలివచ్చిన తెలుగుప్రజలు
సాంస్కృతిక, కళా ప్రదర్శనలతో ఉట్టిపడిన తెలుగుదనం - తెలుగు ఖ్యాతి చాటేలా అతిథులు, వక్తల ప్రసంగాలు - తెలుగు మహాసభల్లో ఇవాళ ముఖ్య అతిథిగా పాల్గొననున్న సీఎం చంద్రబాబు
3rd World Telugu Conference Gradly in Guntur District : పద్యాలు, గద్యాలు, కవి సమ్మేళనాలు, సాంస్కృతిక, కళా ప్రదర్శనలు ఇలా ఎటు చూసినా తెలుగుదనమే.! ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష తెలుగు ప్రజలతో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణం అలరారింది. అమృతతుల్యమైన భాషణలతో అతిథులు, ఆకట్టుకునే ప్రసంగాలతో వక్తలు తెలుగు భాష మాధుర్యాన్ని ఆహుతులకు పరిచయం చేశారు. మాతృభాషలోని కమ్మదనాన్ని అడుగడుగునా ఆస్వాదిస్తూ భాషాభిమానులు మురిసిపోయారు.
42 దేశాల నుంచి తెలుగుప్రజలు : తెలుగు ఖ్యాతిని చాటేలా గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహా సభలు వైభవోపేతంగా సాగుతున్నాయి. సంప్రదాయ వస్త్రధారణల్లో భాషాభిమానులు సందడి చేయగా సంస్కృతిని ప్రతిబింబించే నృత్యాలతో చిన్నారులు ఔరా అనిపించారు. 42 దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలిరావడంతో ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. భారీగా పోటెత్తిన సందర్శకులు తెలుగు మహాసభలకు, మాతృభాషకు జై కొట్టారు. 'ఈనాడు' వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు హస్తకళల ప్రదర్శనల ప్రాంగణంలోని కళారూపాలు కళాకారుల సృజనకు అద్దంపట్టాయి.


Pratiroju 




