23, 26 తేదీల్లో సిట్ ముందు హాజరును మినహాయించండి - కోర్టును ఆశ్రయించిన మిథున్‌రెడ్డి
వైఎస్సార్సీపీ నేత మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ - కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశం - తదుపరి విచారణ రేపటికి వాయిదా
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో ఆనాటి నేతలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పలువురు వైఎస్సార్సీపీ నేతలకు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 23న విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే మినహాయింపు కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది.
తనకు ఈ నెల 23, 26 తేదీల్లో సిట్ దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటి (బుధవారం)కి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రోనక్ కుమార్, అనిల్ చోక్రాల బెయిల్ పిటిషన్లపై విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. నిందితుడు రోనక్ గుంటూరు, అనిల్ చోక్రా విజయవాడ జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద అభియోగాలతో గతేడాది మేలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను నమోదు చేసింది. 33 మందిని అందులో నిందితులుగా చేర్చింది. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో గత సంవత్సరం సెప్టెంబరులో సోదాలు చేసి, కీలక ఆధారాలు సేకరించినట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు.


Pratiroju 




