హెచ్ఎంలకు తలనొప్పిగా పీఎంశ్రీ పథకం
ఎక్కడైనా నిధులు లేక పనులు ఆగిపోతూ ఉంటాయి. పీఎంశ్రీ పథకం తీరు ఇందుకు భిన్నంగా ఉంది. నిధులు దండిగా ఉన్నా... వాటిని ఖర్చు చేయాలంటేనే ప్రధానోపాధ్యాయులు వణికిపోతున్నారు. దీనికి కొన్ని నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి 832 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇప్పటికే కొంత మేరకు మౌలిక వసతులున్న పాఠశాలలను గుర్తించి... వాటిని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలన్నది కేంద్ర విద్యాశాఖ లక్ష్యం. అందుకే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్లపాటు వాటిని అభివృద్ధి చేసి మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా మార్చాలని భావించారు. ఒక్కో పాఠశాలకు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకు వ్యయం చేయాలని నిర్ణయించారు. కొంత మేర నిధుల దుర్వినియోగాన్ని పక్కనబెడితే గత ఆర్థిక సంవత్సరం(2024-25) వరకు నిధులను సజావుగా ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇబ్బంది వచ్చిపడింది.
ఎందుకీ పరిస్థితి?
గత ఏడాది వరకు పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలలకు హెచ్ఎంలుగా ఉన్నవారు బ్యాంకుల నుంచి నిధులను ముందే డ్రా చేసి విద్యార్థుల టూర్లు, యూత్ క్లబ్లు, కెరీర్ గైడెన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. కొన్నిచోట్ల నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారన్న ఆరోపణలతో రాష్ట్రవ్యాప్తంగా కొందరు ప్రధానోపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025-26) నుంచి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చింది. బిల్లులు సమర్పించి...ట్రెజరీల ద్వారా నిధులు డ్రా చేయాలని నిర్దేశించింది. అంటే హెచ్ఎంలు సొంతంగా లేదా అప్పు తెచ్చి ఖర్చు చేయాలి. ఉదాహరణకు బిల్లులు వచ్చిన తర్వాత ఇస్తాం.. విద్యార్థుల టూర్ల కోసం బస్సులు ఇవ్వండి అంటే ఎవరూ ముందుకురారు. అలాగే ప్రతి చిన్న పనికి జీఎస్టీతో కూడిన బిల్లులు సమర్పించాలని కేంద్రం పేర్కొంది. చిన్నాచితకా పనులకు గ్రామాల్లో జీఎస్టీ బిల్లులు ఎలా ఇస్తారని హెచ్ఎంలు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనలతో వారు తలపట్టుకుంటున్నారు. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా రూ.60.69 కోట్లలో కేవలం రూ.5.49 కోట్లే ఖర్చు చేశారు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలోని పాఠశాలలకు రూ.3.27 కోట్లు విడుదల చేయగా...కేవలం రూ.9.65 లక్షలు, రంగారెడ్డి జిల్లాకు కేటాయించిన రూ.3.34 కోట్లలో రూ.19.21 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు.


Pratiroju 




