డిస్కంలకు షాక్‌

డిస్కంలకు షాక్‌

రూ.42 వేల కోట్లకు చేరిన విద్యుత్తు బిల్లు బకాయిలు, ఇవన్నీ రూ.50 వేలకుపైగా చెల్లించని వినియోగదారులవే .

గత సెప్టెంబరు ఆఖరునాటికి రాష్ట్రంలోని రెండు డిస్కంలకు కలిపి రూ.42,155.28 కోట్ల బిల్లులు ఎగవేసినట్లు తేలింది. వీటిలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ తెలంగాణ డిస్కంకు రూ.24,186.83 కోట్లు, వరంగల్‌ కేంద్రంగా ఉన్న ఉత్తర డిస్కంకు రూ.17,968.45 కోట్లు వినియోగదారుల నుంచి రావాల్సి ఉంది. ఇది బిల్లు బకాయిలు రూ.50 వేలకుపైగా చెల్లించని వారి నుంచి రావాల్సిన సొమ్ముగా రెండు డిస్కంలు తేల్చాయి. గత ఆరు నెలల్లో ఇలా బిల్లు కట్టని వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు దక్షిణ డిస్కం పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి 32,346 కనెక్షన్ల నుంచి రూ.20,463.81 కోట్లు రావాలి. కానీ, ఆరు నెలల వ్యవధిలోనే అంటే 2025 సెప్టెంబరు ఆఖరునాటికే ఈ కనెక్షన్ల సంఖ్య 57,324కు, వీటి నుంచి రావాల్సిన సొమ్ము రూ.24,186.83 కోట్లకు ఎగబాకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బిల్లులు కట్టని పరిశ్రమలు ఎక్కువగా ఉన్నట్లు డిస్కం వర్గాలు తెలిపాయి. ఈ డిస్కంకు రావాల్సిన మొత్తం రూ.24,186.83 కోట్లలో హైటెన్షన్‌(హెచ్‌టీ) కనెక్షన్ల నుంచి రావాల్సినవే రూ.23,114.03 కోట్లుగా గుర్తించారు. 

కొన్ని పరిశ్రమలు మూతపడటంతో వాటికి సరఫరా నిలిపివేసినా బిల్లు మాత్రం చెల్లించడంలేదు. నష్టాలతో మూతపడినందున బిల్లుల బకాయిలు కట్టలేమంటూ కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు కోర్టుకు వెళుతున్నట్లు విద్యుత్‌ ఇంజినీర్లు చెప్పారు. పరిశ్రమలే కాకుండా ఇళ్లు, కొన్ని టౌన్‌షిప్, కమ్యూనిటీకాలనీల నుంచీ భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వ్యక్తిగత ఇళ్ల కనెక్షన్ల వినియోగదారులు 2,496 మంది రూ.24.73 కోట్లు చెల్లించలేదు. ఆరు టౌన్‌షిప్‌లు, కమ్యూనిటీ కాలనీల నుంచి రూ.1.65 కోట్లు రావాల్సి ఉంది. వీధిదీపాలకు, ఎత్తిపోతల పథకాలకు సైతం బిల్లులు భారీగా రావాల్సి ఉంది. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో రూ.5,334 కోట్లు, పెద్దపల్లిలో రూ.4,123 కోట్లు, జయశంకర్‌లో రూ.2,682 కోట్లు, నిజామాబాద్‌లో రూ.1,468 కోట్లు, హనుమకొండలో రూ.1,155కోట్లు చెల్లించలేదని తేలింది.

ఆర్‌ఆర్‌ చట్టం అమలేదీ... 

బిల్లుల బకాయిదారులకు రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్‌) చట్టం కింద మండల తహసీల్దార్‌ ద్వారా నోటీసులిచ్చి ఆస్తులను జప్తు చేయించే అధికారం డిస్కంలకు ఉంది. నోటీసులివ్వగానే రాజకీయ నేతల ద్వారా ఒత్తిడి తెచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని సీనియర్‌ ఇంజినీరు ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. భారీగా బిల్లులు ఎగవేసిన హెచ్‌టీ కనెక్షన్ల వారు నాయకుల బంధువులో, అనుచరులో కావడంతో వారికి కరెంటు సరఫరా నిలిపివేయడం, ఆర్‌ఆర్‌ చట్టం కింద నోటీసులిచ్చి ఆస్తులు జప్తు చేయడానికి వీలవడం లేదని ఆయన వివరించారు. ఈ రూ.42 వేల కోట్లు వసూలైతే డిస్కంలకు ఆర్థిక ఇబ్బందులే ఉండవని స్పష్టంచేశారు.