రాడార్‌కు చిక్కవు... శత్రువులకు దొరకవు!
డ్రోన్ల తయారీ ల్యాబ్‌ను సైన్యానికి సమకూర్చిన బిట్స్ హైదరాబాద్ విద్యార్థులు, నెలకు 100 తయారు చేసే సామర్థ్యం
అత్యాధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానమున్న డ్రోన్లను సైనికులే స్వయంగా తయారు చేసుకునేందుకు వీలుగా బిట్స్ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు సైన్యానికి మొబైల్ డ్రోన్ ల్యాబ్‌ను సమకూర్చారు. దీని ద్వారా నెలకు వంద డ్రోన్లను తయారు చేయవచ్చు. కొద్దిరోజుల క్రితం వీరిద్దరూ జమ్మూ కశ్మీర్ వెళ్లి ల్యాబ్‌ను అక్కడ ఏర్పాటుచేశారు. బిట్స్ విద్యార్థులు జయంత్ ఖత్రి, శౌర్య చౌదరి కలిసి రెండేళ్ల క్రితం ‘అపొలియాన్’ అనే అంకుర సంస్థను స్థాపించారు. మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచుల్లో చదువుకుంటున్న వీరు ఏడాదిగా డ్రోన్ల తయారీపై దృష్టి కేంద్రీకరించారు. వీరి డ్రోన్లలో 70% స్వదేశీ, 30% విదేశీ పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఆరు నెలల క్రితం వీటిని వినియోగించిన మన సైన్యాధికారులు భద్రతా కారణాల దృష్ట్యా తామే సొంతంగా తయారు చేసుకునేలా పరిజ్ఞానాన్ని అందివ్వాలని కోరడంతో విద్యార్థులిద్దరూ సమ్మతించారు.
ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో...
‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో మన సైన్యం పాకిస్థాన్ డ్రోన్లను ధ్వంసం చేసిన తీరును చూసి స్ఫూర్తిపొందాం. మన డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకుని... వాటికంటే శక్తిమంతమైనవి తయారు చేయాలని సంకల్పించాం. రోజుల తరబడి పరిశోధించి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా రూపొందించాం. మా డ్రోన్లు శత్రుదేశాల రాడార్లకు చిక్కవు. ఇరుకు ప్రదేశాల్లోనూ ప్రయాణించి... బాంబులు వేయడం వీటి ప్రత్యేకత’’ అని జయంత్ వివరించారు.


Pratiroju 




