మున్సిపల్ ఎన్నికలకు.. మోదీకి ఏం సంబంధం?: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. భవిష్యత్తును ఆలోచించుకొని ఓటు వేయాలని ప్రజలను కోరారు. 12 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న భాజపా.. తెలంగాణకు ఏమైనా ప్రాజెక్టులు మంజూరు చేసిందా? అని ప్రశ్నించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని మోదీనే స్వయంగా హామీ ఇచ్చారు. వాటి గురించి చెప్పట్లేదు.. కానీ, మోదీని చూసి ఓటేయాలని భాజపా నేతలు అడుగుతున్నారు. వరదల్లో నీటమునిగిన వస్తువులన్నీ కేంద్రం నుంచి నిధులు తెచ్చి తిరిగిస్తామని గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మి ఆ పార్టీకి చెందిన 50 మందిని కార్పొరేటర్లుగా గెలిపించారు. ఎన్నికలయ్యాక అడిగితే.. వస్తువులకు బీమా ఉంటుందని బండి సంజయ్ మాటమార్చారు.
దక్షిణాదికి తీవ్ర అన్యాయం
తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని భాజపా నేతలు చెబుతున్నారు. దీనిపై సీఎస్‌ను వివరణ అడిగితే.. మనం రూపాయి చెల్లిస్తే.. కేంద్రం 42 పైసలు ఇస్తోందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు భాజపా తీవ్ర అన్యాయం చేస్తోంది. బిహార్ ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే.. రూ.6.16 కేంద్రం ఇస్తోంది. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ రోజైనా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మాట్లాడారా? మనకు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చెల్లించిన నిధులు తిరిగిస్తే చాలు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో దక్షాణాది రాష్ట్రాలే 40 శాతానికి పైగా చెల్లిస్తున్నాయి.
తెలంగాణకు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశారు. హైదరాబాద్‌కు వచ్చిన సెమీకండక్టర్ ప్రాజెక్టును మోదీ ఒత్తిడి చేసి.. ఏపీకి తరలించారు. ఇప్పడు మోదీని చూసి ఓటేయాలని భాజపా నేతలు అడుగుతున్నారు. అసలు మున్సిపల్ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం? భాజపా నేతలకు దేవుడు అసదుద్దీన్ ఒవైసీ. ఆయన పేరు లేకుండా ఆ నేతల ప్రచారం ఉండదు. మత రాజకీయాల ద్వారా భాజపా రాజకీయ మనుగడ సాగిస్తోంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


Pratiroju 




