హిల్ట్‌పై రాజీ ప్రసక్తే లేదు భట్టి విక్రమార్క

హిల్ట్‌పై రాజీ ప్రసక్తే లేదు భట్టి విక్రమార్క

ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం,2014 నుంచి హిల్ట్‌ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా దర్యాప్తు చేయిస్తాం శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సభ నిరవధిక వాయిదా

హిల్ట్‌ పాలసీ ప్రకటించగానే భూములు అమ్మకానికి పెట్టి రూ.5లక్షల కోట్ల కుంభకోణం చేస్తున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం ఆరోపించింది. ఆరోపించిన వారు మాత్రం వాకౌట్‌ చేసి వెళ్లారు. సభ నుంచి పారిపోయి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

హైదరాబాద్‌ మహానగరంలోని కాలుష్య కారక పరిశ్రమల్ని ఓఆర్‌ఆర్‌ బయటికి తరలించే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హిల్ట్‌ పాలసీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రకటించారు. శాసనసభలో మంగళవారం తెలంగాణ రైజింగ్, హిల్ట్‌ పాలసీలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ 842 ఎకరాల పారిశ్రామిక భూముల్ని ఇప్పటికే సేకరించామని.. మరో 10వేల ఎకరాలకు పైగా  అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. హిల్ట్‌ పాలసీ విషయంలో ప్రతిపక్షాలు ఏవైనా ప్రభుత్వానికి లేఖ రాస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. 2014 నుంచి ఇప్పటి హిల్ట్‌ పాలసీ వరకు ఏ ఏజెన్సీతోనైనా విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌ మనుగడకే ఈ నిర్ణయం

ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న 10 నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. ప్రస్తుతం దిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ భయంకరంగా 628గా ఉంది. హైదరాబాద్‌లో 202గా ఉంది. కాలుష్య నివారణ, ఖజానాకి ఆదాయం, పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. 

హైదరాబాద్‌లో డీజిల్‌ బస్సుల్ని విడతలవారీగా బయటికి పంపాలని నిర్ణయించింది. రూ.806 కోట్ల నష్టం వాటిల్లినా హైదరాబాద్‌ మనుగడకే  కాలుష్యరహితం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎలక్ట్రిక్‌ వాహనాలకు పన్ను లేకుండా చూశాం. ప్రజారవాణా కోసం భవిష్యత్తులో 2000 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. మరోవైపు 2036 సంవత్సరానికి అనుగుణంగా హైదరాబాద్‌లో మురుగునీటి శుద్ధికి 39 ఎస్‌టీపీల నిర్మాణాన్ని చేపడుతున్నాం.

భారాస విధానంతో రూ.574 కోట్లే.. హిల్ట్‌తో రూ.10,776 కోట్లు 

వాస్తవానికి పరిశ్రమల తరలింపు విషయంలో భూముల బదలాయింపు ద్వారా ఎకరాకు రూ.12.1 లక్షలు కట్టాలని భారాస నిర్ణయించింది. ఆ విధానంతో ప్రభుత్వానికి రూ.574 కోట్లు మాత్రమే వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న హిల్ట్‌ పాలసీతో భారీగా ఆదాయం సమకూరబోతోంది. మొత్తంగా ఖజానాకు రూ.10,776 కోట్లు రాబోతోంది.

మేం పరిపూర్ణం చేయబోతున్నాం

ఉమ్మడి రాష్ట్రం నుంచి కాలుష్యకారక పరిశ్రమలపై ఒక్కో అడుగు పడుతూ వచ్చింది. దాన్ని మేం పరిపూర్ణం చేయబోతున్నాం. బాలానగర్, జీడిమెట్ల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో వాయుకాలుష్యం విపరీతంగా పెరగడంతో ఎన్‌జీటీ సూచనల దృష్ట్యా 2012 జులై 28న ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో జారీ అయింది. దాని ప్రకారం నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటికి తరలించాలని 2013లోనే కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమల భూములు యాజమాన్యాలవే. వాటిపైన ప్రభుత్వానికి ఎలాంటి హక్కుల్లేవు. విభజన తర్వాత ఈ భూములపై భారాస ప్రభుత్వం మూడు రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది. 2020లో ఓఆర్‌ఆర్‌ లోపలి పరిశ్రమల్ని బయటికి తరలించి ఆరు పారిశ్రామిక పార్కులుగా మార్చేందుకు గ్రిడ్‌ పాలసీని ప్రకటించింది. ఇండస్ట్రియల్‌ పార్కుల్లోని భూముల్లో 50శాతం ఐటీ పార్కులకు ఇచ్చి.. మిగిలిన భూముల్ని యజమాన్యాలు ఏమైనా చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం విలువలో 100శాతం ఫీజు కట్టి భూమిని తీసుకోవాలని సూచించింది. ఒకవేళ సబ్‌లీజుదారుల వద్ద గనక భూములుంటే 200శాతం చెల్లించాలని చెప్పింది. మలివిడతగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం విలువపై 30శాతం చెల్లించాలని చెప్పింది. అయినా స్పందన రాలేదు.మా హిల్ట్‌పాలసీ మాత్రమే రాష్ట్రానికి మేలు చేస్తుంది’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌ పాలసీతో సమగ్ర వికాసం

తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ రాష్ట్ర వికాసానికి, పిల్లల భవిష్యత్‌కు, ఈ దేశానికి అతి ముఖ్యమైనదని భట్టి అన్నారు. క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌ పాలసీ రాష్ట్ర సమగ్ర వికాసానికి దోహదం చేస్తుందన్నారు. ‘‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. పది వ్యూహాలతో ముందుకెళ్లడం ద్వారా మా ప్రజాప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిస్తుంది. రాష్ట్రం 2047 నాటికి సహజ వృద్ధితో 1.2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ అది రాష్ట్రంలోని రైతులు, దళితులు, గిరిజనులు, మహిళల అభివృద్ధికి సరిపోదు. 2047 నాటికి సంపన్న తెలంగాణకు నిర్మాణాత్మక ప్రణాళిక అవసరం. అందుకు ఈ విజన్‌ డాక్యుమెంట్‌ దోహదం చేస్తుంది. క్యూర్‌.. ప్యూర్‌.. రేర్‌తో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. తెలంగాణలో ఏ ప్రాంతంలోని వ్యక్తి అయినా హైదరాబాద్‌కు 180 నిమిషాల్లోపు చేరుకునే విధంగా మౌలిక వసతులు కల్పిస్తాం’’ అని డిప్యూటీ సీఎం వివరించారు.

హిల్ట్‌ పాలసీని స్వాగతిస్తున్నా: దానం

హిల్‌్్ట పాలసీపై మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ రైజింగ్‌-2047పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వల్పకాలిక చర్చను ప్రారంభించాక వివిధ పార్టీల నేతలు రెండు అంశాలపై మాట్లాడారు. తొలుత ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పందిస్తూ హిల్ట్‌ పాలసీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. స్థిరాస్తి వ్యాపారం కోసమే అంటూ సీఎంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.