తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగాలి: ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగాలి: ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగం పెరగాలని భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా ఇస్తోందా? అని ప్రశ్నించారు.

‘‘ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఈవీలను తక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రం మొత్తంపై ఆ తరహా వాహనాలు 70 వేలే నడుస్తున్నాయి. కాలుష్యం తగ్గాలంటే ఈ సంఖ్య పెరగాలి. రోడ్ ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్ మినహాయిస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలి’’ వెంకట రమణారెడ్డి అన్నారు. 

పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇవ్వాలి: పాల్వాయి హరీశ్‌బాబు

త్రీవీలర్‌, ఫోర్‌ వీలర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రభుత్వ ప్రోత్సహించాలని మరో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మార్చాలంటే ఈవీలను వాడాలని చెప్పారు. వినియోగం పెరిగేందుకు పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పించాలని.. పార్కింగ్‌ స్థలాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈవీ పాలసీ తీసుకొస్తున్నందుకు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.