ఇక తిరుమల తరహాలోనే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ప్రసాదం - నాణ్యతపై అధికారుల దృష్టి
అన్నదాన భవనంలోనూ మార్పులు - దుర్గగుడిలో కొత్తగా అన్నదానం, ప్రసాదాల తయారీ భవనాల నిర్మాణం - రానున్న దసరా నాటికి ఈ భవనాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం
ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులకు అందించే అమ్మవారి ప్రసాదంతో పాటు అన్నదానంలో మరింత నాణ్యత పెంచడంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రస్తుతం దుర్గగుడిలో కొత్తగా అన్నదానం, ప్రసాదాల తయారీ భవనాలను నిర్మిస్తున్నారు. రానున్న దసరా నాటికి ఈ భవనాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. దుర్గగుడి ఈవో వి.కె. శీనానాయక్ ఆధ్వర్యంలో భవన నిర్మాణాలు చివరి దశకు చేరుతున్న నేపథ్యంలో, ఓ అధికారుల బృందం తిరుమలలో అమలవుతున్న విధానాలను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లింది.
నిశిత పరిశీలన: బుధవారం తిరుమల కొండపై లడ్డూ ప్రసాదం తయారీని అక్కడికి వెళ్లిన బృందం క్షుణ్నంగా పరిశీలించింది. వినియోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, తయారీ విధానంతో పాటు ఉపయోగిస్తున్న ముడి పదార్థాల నాణ్యతని కూడా పరిశీలించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అక్కడి ఆలయ సిబ్బందిని అడిగి సేకరించారు. అన్నప్రసాదం తయారీ, భక్తులకు సౌకర్యాలు, భోజనశాల విస్తీర్ణం, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుకుంటున్నారు, వడ్డించే ఉత్తమ విధానాలు అన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. తిరుమల ఇంజినీరింగ్ అధికారులు అక్కడి అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని విజయవాడ బృందానికి అందజేశారు.
ఇప్పటికే భవనాలు కట్టేడయంతో: దుర్గగుడి ప్రాంగణంలోని కనకదుర్గానగర్ ప్రాంతంలో ఇప్పటికే ప్రసాదాల తయారీతో పాటు అన్నదాన భవనాలను 80 శాతానికి పైగా నిర్మించేశారు. తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇక్కడ అధునాతన సాంకేతిక విధానంలో యంత్ర పరికరాలను పెట్టాలంటే, భవన నిర్మాణం ఆరంభించడానికి ముందే పక్కాగా ప్రణాళిక ఉండాలి. ప్రస్తుతం అక్కడ తిరుపతిలో ఉన్న విధానాలను ఎలా ఇంద్రకీలాద్రిలో అమలు చేస్తారనేది వేచిచూడాలి. ప్రసాదాల తయారీ, అన్నదానం కోసం ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్‌లు తాజాగా సూచించడంతో తాము తిరుమలకు వెళ్లామని ఈవో శీనానాయక్ తెలిపారు. భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్న ప్రసాదాలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. పర్యటనకు వెళ్లిన బృందంలో, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు రమేష్‌బాబు, చంద్రశేఖర్ ఉన్నారు.
ప్రక్షాళన చర్యలు ఆరంభం : ఇదిలా ఉండగా విజయవాడ కనకదుర్గ ఆలయంలో భక్తుల సేవల మెరుగుకు ప్రక్షాళన చర్యలు ఆరంభమయ్యాయి. సేవల్లో సంతృప్తి స్థాయి ఆధారంగా ఇటీవల రాష్ట్రంలో 7 ప్రధాన ఆలయాలపై ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో దుర్గగుడి చివరి స్థానానికి పరిమితమైంది. దీంతో ఆలయ అధికారులు అంతర్మథనంలో పడ్డారు. ప్రస్తుతం 3 నెలలు, ఏడాదిలో ఎలాంటి మార్పులు చేయాలనే లక్ష్యంతో పక్కాగా మూడంచెల ప్రణాళిక రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఆలయ అధికారులు దీనిపై దృష్టి సారించారు.
దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులు : మరోవైపు రాష్ట్రంలోని దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులను పెంచాలని ప్రభుత్వం సీరియర్‌గా ఉంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 ప్రధాన ఆలయాలకు ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించింది. దీనిలో భాగంగా విజయవాడ కనకదుర్గగుడిలో ఇకపై సేవలను పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారుస్తున్నారు. భక్తులకు క్యూలైన్లలో నిలబడే ఇబ్బంది ఇక ఉండదు. దర్శనం టికెట్లు, ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వసతి గదుల కోసం కూడా డిజిటల్ పేమెంట్‌నే చేయాల్సిందే. చివరకు కేశఖండన టికెట్లు, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి తీసుకురానున్నారు. హుండీ కాకుండా, ఆలయానికి ప్రత్యేకంగా ఇచ్చే విరాళాలు ఇకపై ఆన్‌లైన్ ద్వారానే స్వీకరించనున్నారు.


Pratiroju 




