ఆ కివీస్‌ స్పిన్నర్‌ మనోడే..

ఆ కివీస్‌ స్పిన్నర్‌ మనోడే..

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు జనవరి 11 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఇందులోభాగంగా 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. న్యూజిలాండ్‌ టీ20 జట్టులో యువ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌ (Adithya Ashok) స్థానం దక్కించుకున్నాడు. అతడి స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు. అతడి తల్లిదండ్రులు ఆదిత్యకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. అతడికి తన తాతతో చక్కటి అనుబంధం ఉంది. మరణించిన తన తాతకు గుర్తుగా తన బౌలింగ్ ఆర్మ్‌పై సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌ డైలాగ్‌ ‘నా దారి ప్రత్యేక దారి’ అంటూ.. తమిళ అక్షరాలతో ఓ టాటూ కూడా వేయించుకున్నాడు.  

23 యేళ్ల ఆదిత్య అశోక్‌ తరచూ భారత్‌ను సందర్శిస్తుంటాడు. అయితే అతడు గత సంవత్సరం కొన్ని వారాలపాటు చెన్నైలోని సీఎస్కే అకాడమీలో కొంతకాలం గడిపాడు. దీంతో అతడు ఇక్కడి పిచ్‌ పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. 

‘మొదట నేను చెన్నై అనుభవం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అలాంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. బంకమట్టి (బ్లాక్‌ సాయిల్‌) పిచ్‌, ఎర్రమట్టి (రెడ్‌ సాయిల్‌) పిచ్‌ల మీద నాకు అవగాహన వచ్చింది. అవి ఎలా ప్రవర్తిస్తాయో ఒక అంచనా ఏర్పడింది’ అని ఆదిత్య అశోక్‌ అన్నాడు. 

అలాగే తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌ అని అతడు వివరించాడు. ‘మీరు నన్ను నీ ఫేవరెట్‌ ఆల్‌టైమ్‌ లెగ్‌స్పిన్నర్‌ ఎవరని అడిగితే.. షేన్‌వార్న్‌ పేరు చెప్పకుండా ఉండటం చాలా కష్టం. కానీ న్యూజిలాండ్‌లో పెరగడం బాగుంది. ఇష్‌ సోధీతో చక్కటి అనుబంధం ఉండటం నిజంగా నా అదృష్టం. అతడు నాకు పెద్దన్నలాంటోడు. నేను ఇష్‌ బౌలింగ్‌ చూస్తూ పెరిగాను’ అని ఆదిత్య వివరించాడు.