జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సులువా/ కఠినమా.. ప్రశ్నల ఛాయిస్‌ మీదే!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సులువా/ కఠినమా.. ప్రశ్నల ఛాయిస్‌ మీదే!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అమలుకు కసరత్తు, కంప్యూటరైజ్డ్‌ అడాప్టివ్‌ టెస్టింగ్‌ విధానాన్ని సిఫారసు చేసిన  ఐఐటీ కాన్పుర్‌
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం

ప్రపంచంలో అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి కోచింగ్‌ పరిశ్రమ ప్రాబల్యాన్ని అరికట్టడం, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందరికీ ఒకటే ప్రశ్నపత్రం కాకుండా... విద్యార్థుల విద్యా సామర్థ్యాలకు అనుగుణంగా ప్రశ్నలు ఇచ్చే కంప్యూటరైజ్డ్‌ అడాప్టివ్‌ టెస్టింగ్‌(క్యాట్‌) తరహా విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ విధానంపై అధ్యయనం చేసిన ఐఐటీ కాన్పుర్‌ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే సిఫారసు చేసింది. కొత్త విధానంతో తల్లిదండ్రులపై ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర విద్యాశాఖ... విధివిధానాల రూపకల్పనకు కార్యాచరణ ప్రారంభించాలని ఐఐటీ కాన్పుర్‌కు సూచించింది.అయితే, ఈ కొత్త విధానం అమలుకు ఏడాది కాలం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న మే నెలలో కాకుండా 2027 మేలో జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అమలుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్‌ను దాదాపు 14 లక్షల మంది రాస్తున్నారు. వారిలో 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత సాధిస్తున్నారు. 

ఐఐటీ కాన్పుర్‌ సిఫారసులు ఇవీ... 

  • తగిన అడాప్టివ్‌ టెస్టింగ్‌ విధానాన్ని రూపొందించేందుకు నిపుణుల కమిటీని నియమించాలి. అందుకు ఐఐటీ కాన్పుర్‌ నేతృత్వం వహిస్తుంది. 
  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అసలు పరీక్షకు రెండు నెలల ముందు నమూనా పరీక్ష(మాక్‌ టెస్ట్‌) ఉచితంగా నిర్వహించాలి. దీనివల్ల విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని... అసలు పరీక్ష నాటికి మరింత సన్నద్ధం అవుతారు. 
  • ప్రశ్నలను ఉత్పత్తి చేసే టూల్‌ను అభివృద్ధి చేయాలి. సులభం, మధ్యస్థం, కఠినం లాంటి ప్రశ్నలను రూపొందించే టెక్నాలజీని తయారు చేసుకోవాలి. 
  • ఈ విధానంలో తొలుత తేలికపాటి ప్రశ్నలు వస్తాయి. వాటికి సరైన జవాబులు గుర్తించేకొద్దీ ప్రశ్నల కఠిన స్థాయి పెరుగుతూ పోతుంది. ఒకరకంగా ఒక్కో విద్యార్థికి ఒక్కో ప్రశ్నపత్రం అన్నట్లే. మరోమాటలో వ్యక్తిగత పరీక్షలనీ చెప్పొచ్చు.
  • విద్యార్థులు కఠిన ప్రశ్నలకు సరైన సమాధానమిస్తే అధిక మార్కులు, తేలిక ప్రశ్నలకు సరైన జవాబులిస్తే తక్కువ మార్కులు వస్తాయి. 
  • ప్రస్తుత విధానంలో జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాస్తున్నారు. మొదటి ర్యాంకు వచ్చిన వారికి... చివరి ర్యాంకు వచ్చిన వారికీ ఒకే ప్రశ్నలు ఉంటున్నాయి.
  • కొత్త విధానంలో అభ్యర్థి సరైన సమాధానాలు చెప్పేకొద్దీ క్లిష్టమైన ప్రశ్నలు వస్తుంటాయి. తప్పుగా జవాబులిస్తే సులభమైన ప్రశ్నలు వస్తాయి. వాటి ఆధారంగా వెంటనే స్కోర్‌ లభిస్తుంది. 
  • తొలుత ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి... వచ్చిన ఫలితాల ఆధారంగా అడాప్టివ్‌ టెస్టింగ్‌ విధానాన్ని అమలు చేసేందుకు దశలవారీగా రోడ్‌ మ్యాప్‌ రూపొందించుకోవాలని కేంద్రం భావిస్తోంది.