లాలూ, తేజస్వీని ఇంటికెళ్లి కలిసిన తేజ్ ప్రతాప్- బహిష్కరణ తర్వాత ఇదే తొలిసారి- ఎందుకంటే?

లాలూ, తేజస్వీని ఇంటికెళ్లి కలిసిన తేజ్ ప్రతాప్- బహిష్కరణ తర్వాత ఇదే తొలిసారి- ఎందుకంటే?

బిహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్​ను తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంటికి వెళ్లి స్వయంగా కలిశారు. తండ్రితోపాటు తల్లి రబ్రీ దేవీ, సోదరుడు తేజస్వీ యాదవ్​ను కూడా తేజ్​ ప్రతాప్ కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. అయితే గతేడాది తేజ్​ ప్రతాప్​ను ఇంట్లో నుంచి బహిష్కరించిన తర్వాత ఆయన, లాలూ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని కలవడం ఇదే తొలిసారి. దీంతో ఇది రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎందుకు కలిశాడంటే?
బిహార్​లో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా 'దహి చుడా' (అటుకులు, పెరుగు, బెల్లంతో చేసే బిహార్ సంద్రదాయ తీపి వంటకం) కార్యక్రమం జరుపుకోవడం అక్కడి ప్రజలకు ఆనవాయితీ. ఇందులో భాగంగానే తన నివాసంలో బుధవారం (జనవరి 14న) ఏర్పాటు చేయనున్న 'దహి చుడా' కార్యమానికి ఆహ్వానించేందుకు లాలూ ఇంటికి తేజ్ ప్రతాప్​ వెళ్లారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా లాలూతోపాటు కుటుంబ సభ్యులను తేజ్ ప్రతాప్ కోరారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సైతం ఆయన అందించారు. ఈ ఫొటోలను తేజ్ ప్రతాప్ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

'నా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవీని వారి నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నాను. నా సోదరుడు తేజస్వీ యాదవ్​ను కూడా మర్వాదపూర్వకంగా కలిశాను. మరక సంక్రాంతి సందర్భంగా బుధవారం నా నివాసంలో ఏర్పాటుచేయనున్న 'దహి చుడా' విందుకు నా కుటుంబ సభ్యులను ఆహ్వానించాను. అలాగే నా ముద్దుల మేనకోడలు కాత్యాయనిని నా ఒళ్లో ఆడించాను' అని తేజ్ ప్రతాప్ యాదవ్ ఎక్స్​లో రాసుకొచ్చారు.