పందెం కోళ్లను బరిలో దింపడానికీ ఓ లెక్కుంది - అదే కుక్కుట శాస్త్రం

పందెం కోళ్లను బరిలో దింపడానికీ ఓ లెక్కుంది - అదే కుక్కుట శాస్త్రం

సమరానికి సై అనే సంక్రాతి పందెం కోళ్లకు ఓ ప్రత్యేక శాస్త్రమే ఉంది. దీనికి రాసిన పంచాంగాన్నే కుక్కుటశాస్త్రం అంటారు. సంస్కృతంలో కుక్కుటం అంటే కోడిపుంజు అని అర్ధం. పందెం రాయుళ్లు పుంజులను బరిలోకి దింపేటప్పుడు కుక్కుట శాస్త్రాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేస్తుంటారు. ఏ కోడిపై ఏ కోడిని దింపితే ఫలితం బాగుంటుందీ అనే అంచనాలు ఈ బరిలో ఎక్కువే. అసలు పందెం కోళ్లు ఎన్ని రకాలు, వాటి తీరు తెన్నులేంటి అనేదానిపై 

ఏడాదిన్నర పాటు శిక్షణ : కోడి పందెంలో రెండు అంశాలది కీలక పాత్ర. ఒకటి కోడి జాతి. రెండు దానికి ఇచ్చే శిక్షణ. కోడి పుంజుల్లో తెల్ల నెమలి, కోడి నెమలి, గౌడ నెమలి, కాకి డేగ, నెమలి కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కక్కురాయి, అబ్రాస్‌, ఎర్రడేగ వంటి జాతులు ఉంటాయి. రెక్కల రంగు, ఇతర శారీరక లక్షణాల ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. ముందుగానే వీటిని ఎంపిక చేసుకుని దాదాపు ఏడాదిన్నర పాటు శిక్షణ ఇచ్చి పందెం బరిలోకి దింపుతుంటారు.

వారాలు, పక్షాలను అనుసరించి : కోడిని ఏ దిక్కు నుంచి బరిలోకి దించితే విజయం సాధిస్తుందనే అంశంలో పందెంరాయుళ్లు కొన్ని నమ్మకాలను అనుసరిస్తారు. వారాలు, పక్షాలను అనుసరించి కొన్ని జాతుల కోడి పుంజుల జీర్ణశక్తి మందగిస్తుందని అంచనా కూడా ఉంది. ఆ సమయంలో పందేనికి దింపితే కోడి అపజయం పాలవుతుందని నమ్మే వారు ఉన్నారు. డేగ జాతి కోళ్లు పోరాట పటిమకు పెట్టింది పేరు. ఇవి చూడముచ్చటగా ఉండటంతో పాటు ఎంతో చురుకుగా కదులుతాయి.నెమలి జాతి కోళ్లు 3కేజీల వరకూ తూగుతాయి. మంచి కండపుష్టి ఉండటంతోపాటు కళ్లు చురుకుగా ఉంటాయి. కాలి గోళ్లు చాలా బలంగా, మొనదేలి ఉంటాయి.

తాళపత్ర గ్రంథాలు సాక్ష్యం : కోడిపందాలు ప్రాచీన సంప్రదాయమనేందుకు తాళపత్ర గ్రంథాలు సాక్ష్యమని పందెం రాయిళ్ల అంచనా. కోడి పుంజులు, వాటి రకాలు, ఏ రకం పుంజు పోరాట లక్షణం ఏమిటి, ఏ రకం పుంజుపై ఏ రకాన్ని బరి లోదించితే విజయావకాశాలు ఉంటాయనే వివరాలు సైతం ప్రాచీన తాళ పత్ర గ్రంథాల్లో లభిస్తాయని గుర్తు చేస్తారు.

పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి కోడి రంగు, జాతిని ఎంపిక చేసి ఆ రోజున ఏ పుంజుతో పందెం వేయాలో ఆ రంగు ఉన్న కోడి పుంజుతోనే పందేలు వేస్తారు. భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు గెలుపొందుతాయని, సంక్రాంతి రోజు యాసర కాకి డేగలు, కాకి నెమలిలు, పసిమగల్ల కాకులు, కాకి డేగలకు చెందిన పుంజులు గెలుపొందితే, కనుమ నాడు డేగలు, ఎర్రకాకి డేగలు గెలుపొందుతాయని కోడిపందాల్లో ప్రావీణ్యం ఉన్న వారి నమ్మకం.

కోళ్లను గుర్తించడం ఓ నైపుణ్యం : బరిలో ఓడి చనిపోయిన కోడి మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంటుంది. వేలంపాట పెట్టి మరీ కొనుగోళ్లు జరిపే సందర్భాలు ఉంటాయి. గ్రామాల్లో పందెం కోళ్లను గుర్తించడం ఓ నైపుణ్యంగా భావిస్తారు. పందెం కోళ్లను గుర్తించడం, వాటిని పోటీలకు సిద్ధం చేయడమే వృత్తిగా జీవిస్తున్నవారు ఎందరో ఉన్నారు.

బరిలోకి దింపే ఈ పందెంకోళ్లలో కొన్ని నియమాలు తప్పనిసరి. రెండు కోళ్ల బరవు ఇంచుమించుగా సమతూకం ఉండాలి. ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ తక్కువలున్నా తేడాలొస్తాయి. పందెం పుంజు ఒంటి గట్టితనం అన్నింటికన్నా ముఖ్యం. అందుకే చన్నీటిని నోటిలోకి తీసుకుని కోడి మీదకు ఊదుతారు. అలా చేస్తే దాని శరీరం గట్టిపడుతుందని ఓ నమ్మకం. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన ఆనందం, ఓడిపోతే తట్టుకోలేని అవమానాలు ఇక్కడ సర్వసాధారణం. మెడమీద ఈకలు రెక్కించి పౌరుషం కళ్లల్లో కదలాడే కోడి పుంజు ఒక్క ఉదుటున గాలిలోకి లేచి ప్రత్యర్థిని దెబ్బతీసే దృశ్యం తిలకించే కిక్కే వేరు.