గాలి, దారం లేకుండానే ఎగిరే గాలిపటాలు - సూరత్ యువకుల విభిన్న ఆవిష్కరణ
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతుంది. అయితే, ఒక గాలిపటం గాలిలో ఎగరాలంటే కచ్చితంగా దానికి ఓ దారం కట్టాల్సిందే. అది కట్టి ఆకాశంలోకి ఎగిరేసిన తర్వాత గాలి రాకపోతే ఇంకా అంతే సంగతి. చివరకు కిందపడిపోతుంది. అదే సమయంలో పతంగులకు వాడే 'మాంజా' మూగ పక్షులు, ద్విచక్ర వాహనదారులకు శాపంగా మారుతోంది. ఈ దారం మెడకు చుట్టుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండగా, వేల సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. ఓ గాలిపటాన్ని ఎగరవేయాలన్న ప్రతిసారి ఇలాంటి చిక్కులు వస్తునే ఉంటాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ గుజరాత్ సూరత్‌కు చెందిన యువ ఇంజనీర్లు ఒక అద్భుత ఆవిష్కరణ చేశారు.
సాంకేతికను ఉపయోగించి దారం, గాలి అవసరం లేకుండానే ఎగిరే గాలిపటాన్ని రూపొందించారు సూరత్‌కు చెందిన యువ ఇంజనీర్లు విక్కీ వఖారియా అతని బృందం భావేష్ గోసాయ్, ప్రథమ్ మావపురి, పార్థ్ లేకడియా. సాంకేతిక పరిజ్ఞానంతో ఎలాంటి దారం, గాలి అవసరం లేకుండానే రిమోట్‌తో ఎగరవేసే ప్రత్యేకమైన గాలిపటాన్ని ఆవిష్కరించారు. ఈ గాలిపటం ఆకాశంలో లూప్స్, రోల్స్, డైవ్స్ వంటి సాహసాలను చేయగలదు. రాత్రి వేళల్లో కూడా ఎగిరేలా దీనికి ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవచ్చు ఇది చీకటిలో ఆకాశాన్ని రంగులమయం చేస్తుంది. దీనికి ప్రస్తుతం విశేషమైన ఆదరణ లభిస్తోంది. హైటెక్ గాలిపటం ద్వారా పక్షులకు, మనుషులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతర్జాతీయంగా జరిగే కైట్ ఫెస్టివల్లోనూ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది.
వినోదం విషాదం కాకూడదని
సూరత్‌లో సంక్రాంతి ముందు ప్రతిఏటా జరిగే ఉత్తరాయణ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజంతా రంగు రంగుల పతంగులను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలిపటాలను ఎగురవేస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా కొందరికి ప్రమాదాలు జరుగుతున్న ఉదంతాలు తరుచూ వెలుగు చూస్తున్న పరిస్థితి. వీరు ఎగరేసే గాలిపటాల మాంజా వల్ల ప్రతిసారి బైక్‌లపై వెళ్లే వారికి అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులకు ఇబ్బందికరంగా మారుతుంది. సంతోషంగా జరుపుకోవాల్సిన పండగ రోజున విషాదాలు జరగడంపై వఖారియా బృందం ఆవేదనకు గురైంది. ఈ ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే సాంకేతికతను ఉపయోగించి గాలి, దారం అవసరం లేని రిమోట్‌తో ఎగరవేసే ప్రత్యేకమైన గాలిపటాన్ని ఆవిష్కరించారు.
"ప్రతి సంవత్సరం ఉత్తరాయణ సమయంలో గాలిపటాల వల్ల పక్షుల తలలు తెగి చనిపోయేవి. ఇలాంటి ఘటనలను నేను పత్రికల్లో చూసి బాధపడేవాడిని. ఆ బాధ ఈ ఆలోచనకు బీజం వేసింది. ఫలితంగా దారం లేకుండానే మేము ఎగిరే గాలిపటాన్ని రూపొందించాం. వాటికి పరిష్కార మార్గాన్ని తెచ్చాం"
- విక్కీ వఖారియా, యువ ఇంజినీర్
భారత్ తరపున ప్రాతినిధ్యం
విక్కీ వఖారియా బృందం తమ ప్రతిభను కేవలం సూరత్‌కే పరిమితం చేయలేదు. అంతర్జాతీయంగా జరిగే కైట్ ఫెస్టివల్లో తమ ఆవిష్కరణను ప్రదర్శించారు. ఇండోనేషియా, సింగపూర్, చైనా వంటి దేశాల్లో జరిగిన అంతర్జాతీయ పతంగుల వేడుకల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు. విశేష గుర్తింపును పొందారు. ఇండోనేషియాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఈ హైటెక్ గాలిపటం గురించి వఖారియా టీమ్ వివరించింది. ఈ సందర్భంగా మోదీ సమక్షంలో ఈ రిమెట్ పతంగిని ఎగురవేసి ఆయన ప్రశంసలు పొందారు. అంతేకాకుండా, చైనాలో జరిగిన పోటీలో 'సిల్వర్ ప్రైజ్' గెలుచుకుని దేశానికి గుర్తింపు తెచ్చింది.
ఒక్కో కైట్‌కు రూ.40 నుంచి 45 వేల ఖర్చు
అయితే ఈ హైటెక్ గాలిపటాల తయారీ అనేది చాలా ఖర్చుతో కూడుకుదని విక్కీ చెప్పారు. ఇప్పటివరకు ఆయన 4 రకాల డిజైన్లలో 15కు పైగా పతంగులను తయారు చేశారు. ఒక్కో పతంగి తయారీకి సుమారు 40 నుంచి 45 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు.


Pratiroju 




