మిజోరంలో కొత్తరకం రెల్లుజాతి పాము

మిజోరంలో కొత్తరకం రెల్లుజాతి పాము

ఆయిజోల్‌: రష్యా, జర్మనీ, వియత్నాం దేశాలకు చెందిన పరిశోధకులతో కలిసి మిజోరం శాస్త్రవేత్తలు రాష్ట్రంలో ఓ కొత్తరకం రెల్లు జాతి పామును గుర్తించారు. భారత సరీసృప జంతుజాల వర్గీకరణలో చాలాకాలంగా ఉన్న తప్పులను సరిచేసి, కొత్త రకం జాతులను చేర్చడం కోసం చేపట్టిన పరిశోధనల్లో దీన్ని గుర్తించారు. ఈ పాము విషపూరితం కాదని తెలిపారు.  దీనికి కలమారియా మిజోరమెన్సిస్‌ అని నామకరణం చేశారు. పామును కనుగొన్న రాష్ట్రానికి గుర్తుగా ఈ పేరు పెట్టినట్లు పరిశోధకుల బృంద నాయకుడు, మిజోరం విశ్వవిద్యాలయంలో జంతుజాల విభాగానికి చెందిన ఆచార్యుడు హెచ్‌.టి.లాల్రెంసంగ తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను సోమవారం జూటాక్సా అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలో ప్రచురించారు. ఈ పాముకు సంబంధించిన నమూనాలను మొదటిసారిగా 2008లోనే సేకరించినప్పటికీ, ఆగ్నేయాసియాలో విస్తృతంగా ఉన్న పాము జాతుల్లో ఒకటిగా అప్పుడు పరిగణించారు.