20 ఏళ్ల తర్వాత శివసేన భవన్‌లోకి.. రాజ్‌ ఠాక్రే భావోద్వేగం

20 ఏళ్ల తర్వాత శివసేన భవన్‌లోకి.. రాజ్‌ ఠాక్రే భావోద్వేగం

సుదీర్ఘకాలం దూరంగా ఉన్న శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray), మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రేలు ఇటీవల చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 20ఏళ్ల తర్వాత శివసేన భవన్‌లో రాజ్‌ ఠాక్రే అడుగుపెట్టారు. ఒకప్పుడు సొంతిల్లులా భావించిన పార్టీ కార్యాలయంలోకి తిరిగి రావడం ఎంతో భావోద్వేగంగా ఉందన్నారు.

‘‘ఇక్కడకు రావడం ఎలా అనిపించింది అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. 20 ఏళ్ల తర్వాత నాకు జైలు నుంచి బయటకు వచ్చినట్లు అనిపిస్తోంది. శివసేనా భవన్‌తో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని చెప్పడానికి రోజులు పడుతుంది’’ అని రాజ్‌ ఠాక్రే పేర్కొన్నారు. 1977లో భవన నిర్మాణం జరుగుతున్న వేళ జనతా పార్టీ ఊరేగింపు జరుగుతోందని, ఆ సమయంలో భవనంపై కొందరు రాళ్లు రువ్వారని అన్నారు. ట్యూబ్‌లైట్లు విసిరి శివసైనికులు వారికి దీటుగా బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఆ ఫలితాలు రద్దు చేయండి - ఉద్ధవ్‌

స్థానిక ఎన్నికల్లో భాగంగా.. 68 వార్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ‘మహాయుతి’ అభ్యర్థుల ఫలితాలను రద్దు చేయాలని ఉద్ధవ్‌ ఠాక్రే రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. పోటీ చేయకుండానే విజయాలు సాధించడం అనేది జెన్‌ జడ్‌తోపాటు తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకునేవారు తమ హక్కును కోల్పోతారని అన్నారు. అధికారంలో ఉన్న మహాయుతి కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆయన.. ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి బీఎంసీ సంపదను కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.