బీజేపీ చేతిలోనే దేశం సురక్షితం- తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం: ప్రధాని మోదీ
దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నాయన్న మోదీ- జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పలు వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీ చేతిలోనే దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గత 12 ఏళ్లలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. తొలిసారి బంగాల్, తెలంగాణలో కూడా అధికారంలోకి రానున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీది మాత్రం ఎల్లప్పుడూ అభివృద్ధి మోడల్ అంటూ చెప్పుకొచ్చారు. దిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పలు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కార్యకర్త అనిపించుకోవడమే నాకు గర్వకారణం: మోదీ
అయితే బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాగలరని ప్రధాని మోదీ తెలిపారు. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు, ఎంపిక అన్నీ ప్రజాసామ్యయుతంగా ఉంటాయని చెప్పారు. దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. కార్యకర్త కేంద్రంగా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయని తెలిపారు. బీజేపీ కార్యకర్త అని అనిపించుకోవడమే తన గర్వకారణంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.


Pratiroju 




