నాడు అమెరికాలో 670కి.మీలు రోడ్డు మార్గంలో ప్రయాణించిన జైశంకర్‌..!

నాడు అమెరికాలో 670కి.మీలు రోడ్డు మార్గంలో ప్రయాణించిన జైశంకర్‌..!

గతేడాది అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ సమయంలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. దీని కారణంగా నాడు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అగ్రరాజ్యంలో ఆయన 670 కి.మీలు రోడ్డు మార్గంలోనే ప్రయాణించారు (S Jaishankar Travels on Road In US). తాజాగా విడుదలైన విదేశాంగ శాఖ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 

ఐక్యరాజ్య సమితి చీఫ్‌ ఆంటోనియో గుటెర్రస్‌తో సమావేశం కోసం గతేడాది నవంబర్‌లో జై శంకర్‌ (S Jaishankar) అగ్రరాజ్యానికి వెళ్లారు. అప్పుడు షట్‌డౌన్‌ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో.. జైశంకర్‌ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాల్సి వచ్చింది. అమెరికా- కెనడా సరిహద్దులోని లూయిస్టన్‌-క్వీన్సటన్‌ వంతెన వద్ద జైశంకర్‌ అక్కడి భద్రతాధికారులను కలిశారు. ఆ తర్వాత ఏడు గంటల పాటు కారులో ప్రయాణించి మాన్‌హట్టాన్‌కు వెళ్లారు. ఆ సమయంలో గడ్డ కట్టే చలి ఉండటంతో పాటు, విజబిలిటీ కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో భద్రతా సిబ్బంది జాగ్రత్తగా కారు నడిపి ఆయనను గమ్యస్థానానికి చేర్చారు. మార్గమధ్యంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అలర్ట్‌ రావడంతో.. భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. ముమ్మర తనిఖీలు చేసి.. కారు ప్రయాణాన్ని కొనసాగించారు.