కేంద్రం కీలక నిర్ణయం- ఆ ఐదు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు

కేంద్రం కీలక నిర్ణయం- ఆ ఐదు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు ప్రత్యేక అధికారాలు

 క్యాన్సర్, డయాబెటిస్ వంటి కొన్ని వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల విషయంలో తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔషధాలకు సంబంధించి తప్పుడు, తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో ఏదైనా ప్రాంగణంలో సోదాలు జరపడానికి, అక్కడి ఏదైనా రికార్డును స్వాధీనం చేసుకోవడానికి ఐదు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా నిర్వాహకులు అధికారాలను ఇచ్చింది.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం (అభ్యంతరకర ప్రకటనలు) కింద ఈ చర్యలు తీసుకునే అధికారం ఐదు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా నిర్వాహకులకు కేంద్రం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జారీ చేసింది. జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా నిర్వాహకులకు అధికారాలను అప్పగించింది.

"లక్షద్వీప్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి, జమ్ముకశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకుడు (లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్) రాష్ట్రపతి నియంత్రణకు లోబడి ఉండాలి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వారి సంబంధిత కేంద్రపాలిత ప్రాంతాల్లో డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం (అభ్యంతరకర ప్రకటనలు) 1954 (1954లో 21) కింద అధికారాన్ని వినియోగించుకోవాలి. అలాగే విధులను నిర్వర్తించాలని రాష్ట్రపతి ఆదేశించారు." అని కేంద్ర హోం శాఖ ఉత్తర్వులో పేర్కొంది.

డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం- 1954 అనేది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో కనిపించే ఆయుశ్ మందులు, ఇతర మెడిసిన్, ఔషధాలకు సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనలు, అతిశయోక్తి వాదనల నిషేధానికి సంబంధినది. ఈ చట్టం గెజిటెడ్ అధికారులు ఏదైనా ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడ సోదాలు జరపడానికి, తప్పుదారి పట్టించే, అనుచిత ప్రకటనలకు సంబంధించిన ఏదైనా రికార్డును పరిశీలించడానికి లేదా స్వాధీనం చేసుకోవడానికి, డిఫాల్ట్ కేసులపై చర్య తీసుకోవడానికి ఇది కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టెనెంట్ గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్‌కు అనుమతిస్తుంది.

మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్‌ సహా 54 రకాల వ్యాధులు, రుగ్మతల చికిత్స కోసం కొన్ని ఔషధాల ప్రకటనలను ఈ చట్టం నిషేధిస్తుంది. ఈ వ్యాధులు చట్టం నిషేధించిన షెడ్యూల్ కిందకు వస్తాయి. రోగాల నివారణకు ఔషధాలను ప్రోత్సహించడం లేదా మార్కెటింగ్ చేయకుండా చట్టం ఔషధ కంపెనీలను నిషేధిస్తుంది. చట్టంలో పేర్కొన్న ఏదైనా వ్యాధి, రుగ్మతను నయం చేయడం, తగ్గించడం, చికిత్స చేయడం, నివారణ కోసం ఆ ఔషధాన్ని ఉపయోగించడాన్ని సూచించే ఏదైనా ప్రకటన ప్రచురణలో ఏ వ్యక్తి కూడా పాల్గొనకూడదని పేర్కొంది. ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం (అభ్యంతరకర ప్రకటనలు) కింద ఈ చర్యలు తీసుకునే అధికారం ఐదు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు లేదా నిర్వాహకులకు కేంద్రం ఇచ్చింది.

సుప్రీంలో పిటిషన్
ప్రస్తుత శాస్త్రీయ పరిణామాలకు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో ఔషధాల ప్రకటనలను నియంత్రించే లక్ష్యంతో తీసుకొచ్చిన డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ (అభ్యంతరక ప్రకటనలు) 1954 చట్ట షెడ్యూల్‌ను సమీక్షించి, నవీకరించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఇటీవలే పిల్ దాఖలు అయ్యింది. డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ చట్టం 1954లోని సెక్షన్‌ 2(సీసీ) కింద ఆయుష్‌ వైద్యులను రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌గా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని నితిన్‌ ఉపాధ్యాయ్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. ఆయుష్‌ వైద్యులు, ఇతర నిజమైన అల్లోపతి కానీ వైద్యులు సెక్షన్‌ 14 మినహాయింపు కిందకు రారని పేర్కొన్నారు.