కెనడాలో వలసదారులకు ‘వర్క్ పర్మిట్ల’ ముప్పు..
ఇంటర్నెట్‌డెస్క్: కెనడాలో లక్షల మంది వలసదారులు ‘వర్క్ పర్మిట్ల’ ముప్పును ఎదుర్కొంటున్నారు. 2025 డిసెంబర్‌తో దాదాపు 10 లక్షల మంది పర్మిట్ల కాలపరిమితి తీరిపోగా.. 2026లో మరో 9 లక్షల మందికి ఆ గడువు ముగియనుంది. దీంతో చట్టబద్ధత కలిగిన పత్రాలు లేకుండా ఆ దేశంలో నివసించే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. వీరిలో సగం మంది భారతీయులే ఉన్నారని తెలుస్తోంది. ఇమిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) డేటా ఆధారంగా ఈమేరకు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి (Canada). దీనివల్ల వలసదారులు మరో వీసా పొందలేరు లేదా, శాశ్వత నివాసం పొందేవరకైనా చట్టబద్ధంగా నివాసం ఉండే హోదానైనా కోల్పోతారు.
వలసలకు సంబంధించిన నిబంధనలను కెనడా (Canada) కఠినతరం చేస్తూనే ఉంది. తాత్కాలిక కార్మికులు, విదేశీ విద్యార్థుల నుంచి ఆశ్రయం కోసం వస్తోన్న అభ్యర్థనల విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వీసా గానీ, శాశ్వత నివాసం పొందడం గానీ అంత సులభమేమీ కాదని తెలుస్తోంది. ఇక, కెనడాలో ఈ స్థాయిలో వలసదారులకు ‘వర్క్ పర్మిట్ల’ ముప్పు ఎన్నడూ ఎదురుకాలేదు. అలాగే వేలల్లో స్టడీ పర్మిట్ల గడువు కూడా తీరనుంది. ఆశ్రయం కోసం చేసే దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురికావొచ్చని ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ కన్వర్ సెయిరా అంచనా వేసింది. చట్టబద్ధ హోదా కోల్పోయిన వలసదారుల సంఖ్య పెరుగుతుండటం కెనడాలో సామాజిక సమస్యలకు దారితీస్తోందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సంక్షోభాన్ని ఎత్తిచూపేలా జనవరిలో నిరసనలు చేపట్టాలని హక్కుల సంఘాలు యోచిస్తున్నాయి. కెనడాలో ఉండటానికి చట్టపరమైన మార్గాలు లేక ఇబ్బందిపడుతోన్న కార్మికుల తరఫున పోరాడనున్నట్లు వెల్లడించాయి.


Pratiroju 




