వెనెజువెలా అధ్యక్షుడు మదురో మా కస్టడీలోనే: ట్రంప్
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా- వెనెజువెలా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యూఎస్ సైన్యం శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కరాకస్‌పై భీకరదాడులు జరిపిన సంగతి తెలిసిందే (Venezuela airstrikes). వాటిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ధ్రువీకరించారు. అలాగే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి తమ కస్టడీలో ఉన్నారని వెల్లడించారు. వారిద్దరిని వెనెజువెలా వెలుపలకు తరలించినట్లు వెల్లడించారు.
దీనిపై అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నామని తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పోస్టు చేశారు. అమెరికా సైన్యానికి చెందిన డెల్టా ఫోర్స్ ఈ ఆపరేషన్‌లో భాగమైంది.
వారి గురించి ఆధారాలు ఇవ్వండి: ఉపాధ్యక్షుడు
తమ అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనెజువెలా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ స్పందించారు. మదురో, ఆయన సతీమణి ఇప్పుడు ఎక్కడున్నారో తమకు తెలియదని చెప్పారు. వారు సజీవంగా ఉన్నారని తెలియజేసేలా ఆధారాలు ఇవ్వాలని అమెరికాను డిమాండ్ చేశారు.
1989 తర్వాత ఒక లాటిన్ అమెరికన్ దేశంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ ఏడాది పనామాపై దాడిచేసి, మిలిటరీ నేత మాన్యుయెల్ నోరిగాను పదవీచ్యుతుడిని చేసింది. ఈ పరిణామాల వేళ వెనెజువెలా పక్కదేశమైన కొలంబియా అప్రమత్తమైంది. ఆ దేశ సరిహద్దుల్లో బలగాలను మోహరించింది


Pratiroju 




