ఒడిశా భీమ మండలి గుహలు- 15 వేల ఏళ్లనాటి ఆదిమానవుల ఆనవాళ్లు!

ఒడిశా భీమ మండలి గుహలు- 15 వేల ఏళ్లనాటి ఆదిమానవుల ఆనవాళ్లు!

ఒడిశా సంబల్​పుర్‌ జిల్లా రైరాఖోల్‌ అటవీ కొండల్లో ఉన్న భీమ మండలి గుహలు, భారత ప్రాచీన చరిత్రను కొత్త కోణంలో చూపించే ఆధారాలను వెలికి తీస్తున్నాయి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న తవ్వకాల్లో సుమారు 15 వేల సంవత్సరాల నాటి మానవ నివాసానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండొచ్చని పురావస్తు అధికారులు భావిస్తున్నారు.

గుహల గోడలపై శిలాచిత్రాలు, రాతి పనిముట్లు
భీమ మండలి గుహల గోడలపై ఉన్న రాతి శిల్పాలు, ప్రాచీన చిత్రాలు, అలాగే తవ్వకాల్లో లభించిన రాతి పనిముట్లు భారత పురావస్తు సర్వే అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతంలో లభించిన మట్టి పాత్రల అవశేషాలు, రాతి సూదులు ప్రస్తుతం కార్బన్ డేటింగ్‌ పరీక్షల కోసం పంపించారు. వీటి నిర్ధారణతో భీమ మండలి ప్రాధాన్యం మరింత స్పష్టమవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

రాతియుగ నాగరికత ఆనవాళ్లు?
భీమ మండలి కొండ గుహల్లో లభించిన ఆధారాలు రాతియుగ నాగరికతకు చెందినవిగా కనిపిస్తున్నాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అందులో వేటకు ఉపయోగించిన పదునైన రాతి ఆయుధాలు, అలాగే గుహల గోడలపై ఉన్న చిత్రాలు, ఈ ప్రాంతంలో మానవు ఉనికిని తెలియజేస్తున్నాయని చెబుతున్నారు.

మహాభారత కాలంతో ముడిపడ్డ నమ్మకాలు
రైరాఖోల్‌ ఉన్న ఈ గుహలు చాలాకాలంగా ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలవిగా, మహాభారత కాలానికి చెందినవిగా స్థానికులు విశ్వసిస్తున్నారు. దీంతో శాస్త్రీయంగా పరిశోధన చేయాలని డిమాండ్​ పెరుగుతోంది. అంతకుముందు, గంగాధర్‌ మెహర్‌ యూనివర్సిటీ, ఇంటాక్‌ పరిశోధకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. తాజాగా పూరి సర్కిల్‌కు చెందిన ఏఎస్ఐ ప్రత్యేక బృందం తవ్వకాలు ప్రారంభించింది. అందులో రాతి బ్లేడ్లు, కత్తులు, సూది ఆకారపు పనిముట్లు, ఈటెలు, బాణాలు లభించాయి. అయితే ఈ పరికరాలన్నీ ఇనుము, రాగి, కాంస్యం వంటి లోహాల వినియోగం తెలియని కాలానికి చెందినవిగా ఏఎస్ఐ అధికారి తెలిపారు. ఈ పనిముట్లు పూర్తిగా రాతియుగానికి చెందినవేనని ఆయన అన్నారు.పురావస్తు తవ్వకాలు అత్యంత జాగ్రత్తగా జరుగుతున్నాయని ఏఎస్ఐ అధికారి​ పేర్కొన్నారు. ఇందులో భారీ యంత్రాలను ఉపయోగిస్తే సున్నితమైన ఆధారాలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో, రోజుకు అర సెంటీమీటర్‌ నుంచి ఒక సెంటీమీటర్‌ వరకు మాత్రమే చేతితో తవ్వకాలు చేస్తున్నారని పేర్కొన్నారు. డిజిటల్‌ పరికరాలను ఫొటోగ్రఫీ, డాక్యుమెంటేషన్‌కే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. భీమ మండలి గుహల్లో కనిపించిన చిత్రాలు అప్పటి మనుషుల దైనందిన జీవితాన్ని, అడవుల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. చెట్ల బెరడు, ఆకులు, ఐరన్‌ ఆక్సైడ్‌ వంటి సహజ రంగులతో చిత్రాలు గీసి ఉంటారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీరు కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాకుండా, వినోదం, భావవ్యక్తీకరణ కోసమూ చిత్రాలు వేశారని పరిశోధకులు తెలిపారు. గంగాధర్‌ మెహర్‌ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రకారం, భీమ మండలిలో 45కిపైగా రాతి ఆవాసాలు ఉన్నాయన్నారు

"మేము ఇక్కడ కనుగొన్న వేట పనిముట్లు ఆధునిక ప్రజలు ఉపయోగించినవి కావు. అవి చాలా పురాతనమైనవిగా కనిపిస్తున్నాయి." అని మరో భారత పురావస్తు అధికారి తెలిపారు.

మరోవైపు, భీమ మండలిని జాతీయ వారసత్వ స్మారకంగా ప్రకటించాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రదేశానికి జాతీయ హోదా వస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గ్రామ పంచాయతీ సభ్యుడు సుదర్శన్‌ సాహు పేర్కొన్నారు.