ఆ యువరాజుతో వివాహం ఓ పీడకల: మోడల్‌ మనోహర

ఆ యువరాజుతో వివాహం ఓ పీడకల: మోడల్‌ మనోహర

మలేసియా యువరాజు (Malaysian Prince)పై ఓ మోడల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనతో తన వివాహం ఒక పీడకల అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్టు పెట్టారు. తన గురించి ప్రస్తావించేప్పుడు ‘మాజీ భార్య’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆమె తప్పుపట్టారు.

2008లో మలేసియాలోని కెలాంటన్ రాష్ట్ర యువరాజు టెంగ్కు మహమ్మద్‌ ఫఖ్రీ పెట్రా.. ఇండోనేసియన్-అమెరికన్ మోడల్ మనోహర ఒడెలియా (Manohara Odelia)ను వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆ ప్రిన్స్ వయసు 31 ఏళ్లు కాగా.. ఆమె వయసు 16 ఏళ్లు. ఆ పెళ్లి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. వివాహం తర్వాత నుంచి తనపై నిఘా పెరిగిందని,  తల్లిదండ్రులతో కూడా మాట్లాడే పరిస్థితి లేకపోయిందని, తనను ఏనాడు మనిషిలా కూడా చూడలేదని గతంలో ఒడెలియా ఆరోపించారు. ఫఖ్రీ తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో 2009లో ఈ రాజ కుటుంబం సింగపూర్‌కు వెళ్లింది. అక్కడే అదును చూసి.. యూఎస్ ఎంబసీ, స్థానిక అధికారులు, తల్లి సహాయంతో సింగపూర్ హోటల్ నుంచి పారిపోయారామె. ఆ తర్వాత వారి బంధానికి ముగింపు పడింది. దాని గురించి ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించారు.

‘‘నా టీనేజ్‌లో ఏర్పడింది చట్టబద్ధమైన బంధం కాదు. అది నేను కోరుకున్నదీ కాదు. అప్పుడు నేను మైనర్‌ని. నాకు కావాల్సింది ఎంచుకొనే వయసు, స్వేచ్ఛ లేవు. చట్టబద్ధమైన వివాహంలో మాజీ భార్య అనే పదం సరైందే. కానీ కొన్నేళ్లుగా నా విషయంలో ఆ పదాన్ని వాడుతున్నారు. అది వాస్తవాన్ని వక్రీకరిస్తుంది. నన్ను ప్రస్తావించేటప్పుడు ఆ పదం వాడొద్దని ఇండోనేసియా మీడియాను కోరుతున్నా’’ అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు.