ఆవిరి బియ్యం.. అందరికీ అనుకూలం

ఆవిరి బియ్యం.. అందరికీ అనుకూలం

పేదలకు, మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తే మేలు ,ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి . 

ఇంతకుముందు వరి కోసి.. పనలు ఆరబెట్టి.. కుప్పలుగా వేసి.. రెండు, మూడు నెలలు మాగిన తర్వాత నూర్పిడి చేసి.. మరపట్టించి బియ్యం వండి తినేవారు. కూలీల సమస్య, పంటల సరళిలో మార్పుల వల్ల యంత్రాలతో కోసి.. అధిక తేమశాతంతో ఉన్న ధాన్యాన్ని తక్కువ రోజులే నిల్వ ఉంచి మర పట్టించడంతో బియ్యం నాణ్యత కోల్పోతున్నాయి. వడ్లు వెంటనే మిల్లింగ్‌ చేయడంతో అన్నం ముద్దవుతోంది. దీన్ని అధిగమించడానికే ఆవిరి ద్వారా ధాన్యాన్ని ఉడికించి బియ్యం తయారీ విధానం అందుబాటులోకి వచ్చింది. మధ్యస్థ, సన్నరకాల్లో కూడా తక్కువ రోజులు నిల్వ ఉన్న వడ్లను ఆడించి బియ్యంగా ఇచ్చినప్పుడు అన్నం ముద్దవుతుంది. ఆవిరి ద్వారా ఉడికించిన బియ్యమే దీనికి పరిష్కారమని ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది.

ఆవిరితో ధాన్యాన్ని ఉడికించి..

వరి కోసిన వెంటనే ధాన్యాన్ని ఆవిరితో ఉడికించిన తర్వాత చల్లబరిచి మర పట్టిస్తే నిల్వ ఉంచకపోయినా అన్నం తినడానికి అనువుగా ఉంటుంది. ధాన్యం పొట్టు, తవుడులో ఉన్న పోషకాలు బియ్యపు గింజలోకి చేరతాయి. పచ్చిబియ్యంతో పోలిస్తే ఎక్కువ ఫైబర్, విటమిన్లు ఉంటాయి. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌(జీఐ) తక్కువ. ఈ ప్రక్రియలో రైతులకు ధాన్యం ఆరబెట్టడం, నిల్వచేయడం అక్కర్లేదు.